రేపటి కోసం అంటూ ఒక్క పైసా దాచుకోకుండా తాను జీవితాంతం గడించిన జీతంలో 90 శాతం మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని 685 పాఠశాలలకు విరాళంగా ఇచ్చిన ధన్యజీవి, విద్యాదాత శ్రీ పంచానన్ పడూయ్. హౌరాలోని డోమ్‌జడ్ ప్రాంతానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు. ఏడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి, ఉన్న పొలం కాస్తా కరవు కోరల్లో చిక్కుకోవడంతో ఈ కుటుంబం నిరుపేదగా మారింది. తన తల్లి మట్టికుండల్లో చాలీచాలని బియ్యాన్ని వండిపెట్టేదట. సాయం పొందే అవకాశమేలేకపోయింది. పశువులు కాశారు, గడ్డి కోశారు. డబ్బున్నవారిళ్ళల్లో బట్టలుతికారు. చీరెలు అమ్మారు. జౌళి మిల్లులో పనిచేశారు. ఈ క్రమంలో రాత్రి వేళ చదువుకుని బికాం పాసయ్యారు. రాహ్రాలోని శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. చివరికి హిందీ పండితునిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.
ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment