Saturday, December 27, 2008

వీడేరా పోలీస్...

నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...

ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.

మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను.

Friday, December 26, 2008

సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!

జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.

అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా.

సునామీ నువ్వెంత?

సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?

అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే.

Saturday, December 13, 2008

రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...

ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం.

సరోజ చేతిలో ఎర్రజెండా

గడచిన పాతికేళ్లుగా వేలూర్‌లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.

సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...

Friday, November 21, 2008

చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు

అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం.

పద్యంతో మద్యం మాయం

అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.

ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది.

Friday, October 10, 2008

దానవీరశూర బాల కర్ణ

నాన్నా, ఈ కుర్రాడెవరు ? అని వార్తాపత్రిక చదువుతున్న తన తండ్రిని అందులో ఉన్న ఫొటో గురించి అడిగాడు ఐదేళ్ల సంజీవ్ కుమార్.

"అతనికి గుండె జబ్బు బాబూ. సాయం చెయ్యమని అడుగుతున్నారు. ఆపరేషన్ చెయ్యకపోతే చచ్చిపోతాట్ట" అని బదులిచ్చాడు తండ్రి వేణుగోపాల్.

"ఆ సాయం మనం చెయ్యలేమా నాన్నా ?" అడిగాడు సంజీవ్.

"అంత డబ్బు మన దగ్గర లేదుగా..." బదులిచ్చాడు నాన్న.

"సరేగానీ, నాకు ఈ దీపావళికి ఎన్ని రూపాయల బాణసంచా కొనిస్తావ్?" చెప్పు అనడిగాడు ఈ చిన్నారి.

తండ్రికి ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా... "ఓ 2,500 రూపాయలవి కొంటా" అని చెప్పాడు నాన్న.

"అయితే, ఆ డబ్బు ఆ అబ్బాయికిచ్చి సాయం చేద్దాం." అని సంజీవ్ చెప్పగానే ఒక్కసారి ఆ కన్న తండ్రికి ఒళ్లు పులకరించి గగుర్పొడిచింది. చిన్న పిల్లాడికి వచ్చిన ఆలోచన తనకు రాకపోవడం పట్ల సిగ్గుపడ్డాడు కూడా.

ఈ సంఘటన 2003లో జరిగింది. ఆ రోజు మొదలుకొని చిన్నారి సంజీవ్ తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో ఓ 50 మందికి పైగా ఆపన్నులను ఆదుకున్నాడు. ఈ సాయాన్ని అతను పోస్ట్ ద్వారా పంపిస్తాడు. సాయమందుకున్నవారు కృతజ్ఞతతో రాసే ఉత్తరాల్ని చూచి పరమానందం పొందుతుంటాడు ఈ చెన్నై చిన్నారి.

హాకీ వీరుడుకూడా అయిన ఈ బాలకర్ణుడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తమిళనాడు తరఫున పలు అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాడు. మంచి హాకీ క్రీడాకారునిగా ఎదిగి ఆ డబ్బుతో తన సేవలను కొనసాగిస్తాట్ట. ఈ బుల్లి కర్ణుడి ఆశయం ఎన్నో జీవితాలకు కోత్త కోణాల్ని చూపించాలని ఆశిద్దాం.

Sunday, September 21, 2008

కుక్కపిల్ల ఉచితం

ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకున్న విషయం ఆమె చెవినబడితే చాలు. వెంటనే వివరాలు తెలుసుకుని వీవీఐపీల ద్వారా వారికి కావలసిన సామగ్రి అందచేయడం తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న మలర్ విళి అలవాటు. ఆవిడ అంతటితో ఆగిపోదు. అవయువాలన్నీ సక్రమంగా ఉన్న మనుషులకే నేటి సమాజంలో ఒంటరి పోరాటం తప్పడంలేదు. అందుకే ఆపత్సమయంలో అండగా ఉండేందుకు వికలాంగులకు ఒక కుక్కపిల్లను కూడా కొనిస్తారీమె. తాను కూడా వికలాంగురాలు కావడంతో వికలాంగుల బాధలు ఎలా ఉంటాయో మలర్ విళికి బాగా తెలుసు. వికలాంగులకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈమె కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరుపుతారు.

తన తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఒకరైన మలర్ విళి చరిత్రలో ఎం.ఎ పట్టా అందుకున్నారు. గృహిణిగా, ఉద్యోగినిగా, సామాజిక సేవకురాలిగా ఎన్నో బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈమె గురించి తెలిసేనాటికి ఈవిడ నామక్కల్‌లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా ఎక్కడికి బదిలీ అయితే ఆ ప్రాంతంలో తన సేవలు కొనసాగిస్తుంటారు.

Sunday, August 17, 2008

మనసున్న మెకానిక్

చెన్నై జాఫర్‌ఖాన్ పేటలో ఉంటున్న సెంథిల్ (ఇతని గురించి తెలిసేనాటికి ఇతని వయసు 30) కార్ల మెకానిక్, పెద్దగా చదువుకోలేదు. ఇతని స్నేహితుడు విశాకన్‌కు పాపం పోలియో వల్ల ఎడమకాలు, కుడి చెయ్యి సరిగ్గా పనిచెయ్యవు. తన మిత్రుడికి ఎలాగైనా సహాయపడాలన్నది సెంథిల్ కోరిక. వెంటనే రంగంలోకి దిగి వికలాంగులు అవలీలగా నడపడానికి వీలుగా విశాకన్ వాహనంలో మార్పులు చేశాడు. అందులోని సీట్లు, యాక్సిలేటర్, బ్రేకులు వంటి భాగాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా వికలాంగులు ఉపయోగించుకునేలా రూపొందించాడు. హెడ్‌లైట్లు, హారన్ వంటివి పనిచెయ్యడానికి ఒకే స్విచ్ ఉండేలా సెంథిల్ ఏర్పాట్లు చేశాడు. సెంథిల్ తన స్నేహితుడు కావడం గర్వకారణమంటున్న విశాకన్ ఒకప్పుడు తన వాహనంలో కొంత దూరం వెళ్లడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు 50 కిలోమీటర్లకు మించి స్వయంగా ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. ఈ స్నేహితుల గురించి తెలుసుకున్న చాలామంది వికలాంగులు ఇప్పుడు తమ కార్లతో సెంథిల్ షెడ్ వద్ద బార్లు తీరుతున్నారు.

Tuesday, July 22, 2008

ఆమెను గోమతి మామీ అంటారు

ఏ కుటుంబంలోనైనా మరణం సంభవించినట్లు తెలిస్తే చాలు, ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు 70 ఏళ్లు పైబడిన గోమతి మామీ. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చేస్తారు. వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పురోహితుణ్ణి మాట్లాడటంతోపాటు అంతిమయాత్రకు అవసరమైన పువ్వులు, నవధాన్యాలు, నూనె, గంధపుచెక్క, నిప్పు వరకూ అన్నిటికీ ఆమే దగ్గరుండి చేయూతనిస్తారు. ముఖ్యంగా బాధలో ఉన్నవారు ఏమీ తినరు. వారిని ఓదార్చి నాలుగు మెతుకులు తినిపించడం మర్చిపోరామె. తమిళనాడులోని ప్రముఖ నగరం కోయంబత్తూరుకు సమీపాన ఉన్న పొన్నయ రాజాపురంలో ఉంటారు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 70 ఏళ్ల గోమతి అమ్మాళ్. అందరూ ఆమెను గోమతి మామీ అంటారు. 12 ఏళ్ల కిందట భర్తను కోల్పోయిన మామీ గారు ఆ దుఃఖాన్ని అనుభవించి తన లాంటి ఎందరికో సాయమందించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో అభ్యంతరాలు ఎదురైనా ఆవిడ పట్టించుకోలేదు. గత పదేళ్లకు పైగా ఈవిడ వేల సంఖ్యలో అంత్యక్రియలు జరిపించారు. పేదలకు అంతా ఉచితంగానే అందజేస్తారు. కుమార్తె మైథిలి, ఒక సహాయకుడు తోడుగా గోమతి మామీ తన సేవలు అందిస్తుంటారు. ఈవిడ దగ్గర అంబులెన్స్ కూడా ఉంది.

Saturday, June 14, 2008

సైకిల్ శాంతిదూతలు ఈ దంపతులు

ముందు వైపు గాంధీ చిత్రపటం, ఆయన హితోక్తుల బోర్డు, జాతీయ జెండా ఉన్న సైకిల్ మీ ఊరు వచ్చిందంటే దాని అర్థం కరుపయ్య, చిత్ర దంపతులు అక్కడికి వచ్చారని అర్థం. వీరిద్దరూ మొత్తం 268 రోజుల్లో 11 వేల 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దేశంలోని 17 రాష్ట్రాలు చుట్టి వచ్చారు. ఇంతకూ వీరు ఇదంతా చేసింది ఏదో వినోదం కోసమో లేదా విహారం కోసమో కాదు. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఉగ్రవాదంతో అశాంతిమయమైన మన దేశంలో శాంతి సామరస్యాల ప్రాధాన్యత ఏమిటనేది వివరించడమే వారి లక్ష్యం. తమిళనాడులోని మదురై జిల్లాలోని విరుదునగర్ సమీపాన గల విశ్వనత్తం గ్రామానికి చెందిన ఈ దంపతులు ఆగస్టు 4, 2003వ తేదీన యాత్ర ప్రారంభించి దిగ్విజయంగా ముగించారు. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ విశ్వనత్తం దంపతులు పేరుకు తగ్గట్టుగా విశ్వశాంతి కోరేవారే కదూ....

Wednesday, May 21, 2008

వేడినీళ్ల దానం

తమిళనాడులోని ప్రముఖ పట్టణం సేలం పేరు విననివారుండరు. ఇక్కడున్న ప్రభుత్వాసుపత్రి దగ్గర ఒక పేద మహిళ ఫుట్‌పాత్ పైనే టిఫిన్ దుకాణం నడుపుకుంటుంది. ఆమె టిఫిన్‌కు మాత్రమే డబ్బు తీసుకుంటుంది కానీ వేడి నీళ్లు మాత్రం ఎన్ని కావాలంటే అన్నీ ఉచితం. ముఖ్యంగా ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే పేదలు రోగులందరికీ వేడినీళ్లు, కాచి చల్లార్చిన నీళ్లు మత్రమే తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రభుత్వాసుపత్రుల్లో "మంచి" మంచినీళ్లకే కరవుగా ఉంటే ఇక వేణ్ణీళ్లు ఎక్కడుంటాయి. ఈ సమస్యను గ్రహించిన ఆ ఫుట్‌పాత్ హొటల్ యజమానురాలు ఉచితంగా వేణ్ణీళ్ల సరఫరా ప్రారంభించింది. మరో విషయం.. వేణ్ణీళ్లతోబాటు వాటిని పట్టుకెళ్లడానికి క్యాన్లు కూడా ఉచితమేనండోయ్.

Saturday, April 12, 2008

ఓటరు మహాశయురాలు

ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ఓటేయడం కోసం 14 రోజుల పాటు తన 13 ఏళ్ల మనుమడి సాయంతో కాలినడకన 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన 65 ఏళ్ల ఓటరు రత్నం ఆమె. ఓటును అమ్ముకోవడమే తప్ప, ప్రజాస్వాములను నమ్ముకునే పరిస్థితులు లేని మన దేశంలో ఇంత గొప్ప ఓటరు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా ? మీరు అంతగా జుట్టు పీక్కోవలసిన పనిలేదు. భారతదేశంలో చాలామంది ప్రజాప్రతినిధుల అవినీతి చరిత్ర కథలు కథలుగా మీడియాలో సీరియళ్లుగా ప్రసారమవుతున్న ఈ రోజుల్లో ఓటేయడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేంత గొప్ప ఓటర్లు ఎవరూ మన దేశంలో లేరన్న మాట నిజమే. రాచరికం నుంచి ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందే క్రమంలో భూటాన్‌లో నిర్వహించిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన ఇది.

భూటాన్‌లో వాంగ్‌ఛుక్ వంశీయుల పాలనకు తెరదించే ఈ తొట్టతొలి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ పాల్గొని వారి వారి జన్మ స్థలాల్లో మాత్రమే ఓట్లు వేయాలన్న రాజు విజ్ఞప్తికి ఎంతమంది స్పందించారో తెలియదు గానీ, ష్యువాంగ్ డెమా మాత్రం రాజాజ్ఞను శిరోధార్యంగా భావించింది. కారులో వెళదామనుకుంటే వాంతులవుతాయని భయం. నాలుగేళ్ల కిందట ఓ సారి ఆమె కారు ప్రయాణం చేసినప్పుడు వాంతులై అనారోగ్యం పాలైందట. డెమాకు అది గుర్తొచ్చి వాహన ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంది. ఏమైతేనేం ఎలాగైనా ఓటు వేసి తీరాలని నిర్మయించుకుంది.

భూటాన్ రాజధాని థింపూలో ఉంటున్న డెమా ఎట్టకేలకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో తన జన్మస్థలం ఉన్న ట్రాషియాంగ్‌స్టే జిల్లాకు కాలినడకన ప్రయాణం కట్టింది. భారీ పర్వత ప్రాంతాల గుండా క్లిష్టంగా సాగే ఈ ప్రయాణంలో ఆమె తన మనుమడితో నడుస్తూ రాత్రిళ్లు ఆయా గ్రామాల్లో బస చేసేది. చివరకు స్వస్థలానికి చేరుకొని తన సమీప బంధువు ఇంట్లోకి వెళ్లగానే వాళ్లంతా కన్నీళ్లపర్యంతమయ్యార్ట. ఎందుకంటే వాళ్లు ఈమెను చూసి దాదాపు నాలుగేళ్లయిందట. అందులోను ఈ వయసులో యుక్త వయసైనా రాని బాలునితో నడచి వచ్చిందన్న సంగతి తెలిసి నోరెళ్లబెట్టారు. చివరకు ఓటేసి ఆనందంగా థింపూ వెళ్లిందట డెమా.

డెమా సంగతి ఇలా ఉంటే... ఓట్లేయడానికి దేశంలోని లక్షల మంది జనం స్వస్థలాలకు నడచి వెళ్లకున్నా... వ్యయానికి లెక్క చేయక వాహనాల్లో వందల మైళ్ల దూరం ప్రయాణం చేసి ఓట్లేశారట. స్వంత ఊళ్లకు వెళుతున్నాం కదా అని బంధువులు, మిత్రులకు భారీగా బహుమానాలు పట్టుకెళ్లారట. బహుమానాలను కొనుగోలు చేయడం కోసం చాలా మంది అప్పులు కూడా చేశారట. ఎన్నికల పుణ్యమా అంటూ వాహనాలన్నీ కిటకిటలాడిపోవడం సంగతి అటుంచి కుటుంబీకులంతా ఒక చోట కలుసుకున్నందుకు ప్రజలంతా సంతోషపడ్డారట. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉంటున్న భూటాన్ జాతీయులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు కేవలం ఓటు వేయడానికి తమ స్వదేశానికి వచ్చినట్లు ది డ్రక్ అనే ఓ హొటల్ యజమాని దిలు గిరి చెప్పారు.

మన దేశంలో ఇలాంటివి ఊహించగలమా... ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లే లోపు ఆ ఓటును మరొకరు కాజేయరూ....

Friday, March 28, 2008

మాజీ మంత్రి కొడుకు : పేపర్ల అమ్మకం

కాస్త వీలు చేసుకొని అలా బీహార్‌లోని ముజఫర్‌పూర్ వెళ్లి మెయిన్ మార్కెట్లో నడచి ముందుకు నాలుగడుగులు వేస్తే... "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ 50 ఏళ్లు దాటిన ఉదయ్ ప్రకాశ్ గుప్తా గొంతు పీలగా వినిపిస్తుంది. అయితే ఏంటంట అని మీరడగటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన గురించి ఎవరికీ తెలియదుగా. 60వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ మంత్రివర్గంలో ఆహారం మరియు పౌర సరఫరాల మంత్రిగా పనిచేసిన మోహన్ లాల్ గుప్తా కొడుకే ఈ ఉదయ్ ప్రకాశ్ గుప్తా.

వార్డు కౌన్సిలర్ కొడుకైతే చాలు ప్రపంచమే తనదైనట్లుగా మధువు, మగువలతో విలాసాల మధ్య ఒళ్లూపై తెలియకుండా మదమెక్కి ప్రవర్తించే ఈ రోజుల్లో ఉదయ్ ప్రకాశ్‌ను నేటి సమాజం వింత జీవిగానే పరిగణిస్తుంది. ఇప్పటి మంత్రులు తమ పిల్లల చేత ఓ వార్తా సంస్థ లేదా టీవీ ఛానల్ పెట్టించేస్తుండగా పాపం మోహన్ లాల్ గారికి, ఉదయ్ ప్రకాశ్‌కు అలాంటి తెలివితేటలు లేకపోయాయి.

ఉదయ్ దైనందిన కార్యక్రలాపాలు పొద్దుటే 4.30 గంటలకు మొదలవుతాయి. ముజఫర్‌పూర్‌లోని నయాటోలాలో ఉన్న తన ఇంటి నుంచి వార్తా పత్రికల కట్టలతో సైకిల్‌పై బయలుదేరి తన ఖాతాదారుల ఇళ్లకెళ్లి పేపర్లు వేస్తుంటాడు. ఈ పని పూర్తయ్యాక మెయిన్ మార్కెట్‌కు వెళ్లి "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ పత్రికలు అమ్ముకుంటాడు.

మోటార్ మెకానిక్స్ కోర్సు పూర్తి చేసిన ఉదయ్ తండ్రి మోహన్ లాల్ మంత్రి అయినప్పటికీ సిద్ధాంతాలు, విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. కొడుకు సహా కుటుంబీకులు, బంధువుల పట్ల ఆశ్రత పక్షపాతం కనబరచలేదు. అందుకే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఉదయ్ బీహార్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఉదయం ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ 50వ దశకంలో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నయాటోలా ఇంటిని సందర్శించిన సంగతులు నెమరు వేసుకున్నారు.

ఈ జీవితం మీకు బాధగా అనిపించడం లేదా అని అడిగితే... ఇదే బాగుందన్న సమాధానమే ఉదయ్ నోటి వెంట వచ్చే జవాబు.

Tuesday, February 19, 2008

ప్రేమికులా?... ఐఎల్‌పీలో చేరండి

అతనూ ఓ భగ్న ప్రేమికుడే ! ప్రేమించిన పాపానికి కుటుంబానికి దూరమై, అవమాన భారాన్ని మోసినవాడే ! అందుకే తనలాంటి వారి కోసం చెన్నైలో ఇండియన్ లవర్స్ పార్టీ (ఐఎల్‌పీ)ని ప్రారంభించాడు. మొన్న 14 తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలోని కోడంబాక్కంలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. ఇంతకూ ఇతనెవరంటారా ? చెన్నైకి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకుమార్. ప్రస్తుతం ఐఎల్‌పీలో 5000 మంది సభ్యులు చేరగా ఇందులో 3000 మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల యువతులేనట (ప్రేమలో ఎక్కువగా మోసపోయేది యువతులేగా...)

ఐఎల్‌పీకీ ఓ జెండా... ఓ ఎజెండా కూడా ఉన్నాయండోయ్... హృదయంపై బాణం, మధ్యలో తాజ్‌మహల్ ఈ పార్టీ గుర్తు. ఇక ఎజెండా ఏమిటంటే... ఎన్ని ఆటంకాలెదురైనా ప్రేమకు లక్ష్యం పెళ్లేనన్న కృతనిశ్చయంతోనే పార్టీ సభ్యులను (ప్రేమికులు) ముందుకు నడిపించడం. ప్రేమ ఎంతో విలువైనదని, దీనిని అర్థం చేసుకోలేని కొందరు ప్రేమికుల దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అన్నట్టు... ఈ ఏడాది వేలంటైన్స్ డేను శ్రీకుమార్ ఘనంగా జరిపాడు. చెన్నైలో ప్రేమ పుష్పాలు ఎక్కువగా వికసించే మెరీనా బీచ్, ఇలియట్స్ బీచ్, పార్కులకు వెళ్లి 'వాలెంటైన్స్ డే వర్థిల్లాలి' అనే నినాదం ఉన్న పోస్టర్లు అంటించాడు. కనిపించిన ప్రేమికులందరికీ గులాబీలు పంచి శుభాకాంక్షలు తెలిపాడు. అదే సమయంలో ఐఎల్‌పీ సభ్యులెవరూ వెకిలి చేష్ఠలకు పాల్పడకుండా, సమాజంలో అప్రతిష్ఠపాలు కాకుండా మార్గదర్శకాలు, నియమ నిబంధనలను కూడా రూపొందించాడు. ప్రేమికుల జీవితాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మజ్ను.

Saturday, January 26, 2008

ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్

శబ్ద కాలుష్యం అతి తక్కువగా ఉన్న గ్రామాలపై సర్వే చేస్తే... చెన్నై - పాండిచ్చేరి సముద్రతీర మార్గమధ్యంలో ఉన్న కళుపెరుంబాక్కం అనే ఊరికి మొదటి బహుమతి ఖాయం. ఎందుకంటే గత 14 ఏళ్లుగా ఆ ఊరు శబ్దాలకు దూరంగా నిశ్శబ్దంగా ఉంటోంది. అంతేకాదు బాగా కాంతివంతమైన దీపాలు కూడా వెలిగించరు. దీపావళి పండుగ వచ్చినా అక్కడ ఇదే పరిస్థితి. బాంబులు, టపాసులు ఏమీ పేల్చరు.

ఏమిటయ్యా అని గట్టిగా ఆరా తీస్తే ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్ మెల్లగా మాట్లాడమన్నారు. గబ్బిలాలేమిటి, ఎగిరిపోవడమేమిటి బాబూ కాస్త ఆ కథ, కమామీషు ఏమిటో సెలవిమ్మని అడిగితే అప్పుడు ఆ ఊరి పెద్ద పళనిస్వామి అసలు విషయం చెప్పారు. వాళ్ల ఊళ్లోని చెట్లపై 20 ఏళ్లుగా వందల సంఖ్యలో గబ్బిలాలు నివాసముంటున్నాయని, శబ్దాలకు బెదిరిపోయి అవి ఎగిరిపోకుండా తామంతా శబ్దాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.

గబ్బిలాలు ఎగిరిపోతే ఏంటంట అని అడిగినవాళ్లను పళనిస్వామి గద్దిస్తూ... అంటే మా ఊరు సుఖంగా ఉండాలని లేదా మీకు అని రెట్టించి అడిగారు. గబ్బిలాలకు, మీ ఊరి సుఖసంతోషాలకు సంబంధమేంటో అర్థం కావడం లేదు కానీ... కాస్త ఆ గుట్టు విప్పండని అడిగితే అప్పుడు ఆయన మళ్లీ మొదలు పెట్టారు.

ఓసారి కళుపెరుంబాక్కం ఆలయంలో మేళతాళాలతో ఉత్సవం జరిగినప్పుడు ఈ గబ్బిలాలు ఆ ధ్వనులకు బెదిరిపోయి చెట్లు విడిచి వెళ్లిపోయాయట. ఆ తర్వాత రెండు రోజులకు ఈ గ్రామంలో జనం ఉన్నట్టుండి వ్యాధుల బారిన పడటం, పలువురు అకారణంగా మరణించడం, కరవు లాంటి అశుభాలు చోటు చేసుకున్నాయట. ఎన్నడూ లేని విధంగా విపరీత పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ చేటుకు కారణం చెట్ల మీద ఉండే గబ్బిలాలు ఎగిరిపోవడమేనని గ్రామస్తులకు అనిపించిందట. ఎందుకంటే, గబ్బిలాలు అన్నాళ్లూ చెట్లపై ఉన్నంతకాలం గ్రామం సుభిక్షంగా ఉందని, అవి బాజాభజంత్రీల శబ్దాలకు బెదిరి చెల్లా చెదురైనప్పుడే ఈ విషాదం సంభవించిందని వాళ్లంతా నమ్మారు. ఆ వెంటనే వాళ్లంతా శబ్దాలకు స్వస్తి పలికి, గబ్బిలాల్ని మళ్లీ రప్పించమని గుడిలో ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

ఆ పూజలు ఫలించాయి. గలగలమంటూ గబ్బిలాలు మళ్లీ చెట్లపై వాలాయి. ఆ రోజు నుంచీ కలుపెరుంబాక్కంలో శబ్దాలు వినిపిస్తే ఒట్టు. ఇది ఊరి పెద్దల తీర్మానం.