ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ఓటేయడం కోసం 14 రోజుల పాటు తన 13 ఏళ్ల మనుమడి సాయంతో కాలినడకన 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన 65 ఏళ్ల ఓటరు రత్నం ఆమె. ఓటును అమ్ముకోవడమే తప్ప, ప్రజాస్వాములను నమ్ముకునే పరిస్థితులు లేని మన దేశంలో ఇంత గొప్ప ఓటరు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా ? మీరు అంతగా జుట్టు పీక్కోవలసిన పనిలేదు. భారతదేశంలో చాలామంది ప్రజాప్రతినిధుల అవినీతి చరిత్ర కథలు కథలుగా మీడియాలో సీరియళ్లుగా ప్రసారమవుతున్న ఈ రోజుల్లో ఓటేయడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేంత గొప్ప ఓటర్లు ఎవరూ మన దేశంలో లేరన్న మాట నిజమే. రాచరికం నుంచి ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందే క్రమంలో భూటాన్‌లో నిర్వహించిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన ఇది.
భూటాన్‌లో వాంగ్‌ఛుక్ వంశీయుల పాలనకు తెరదించే ఈ తొట్టతొలి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ పాల్గొని వారి వారి జన్మ స్థలాల్లో మాత్రమే ఓట్లు వేయాలన్న రాజు విజ్ఞప్తికి ఎంతమంది స్పందించారో తెలియదు గానీ, ష్యువాంగ్ డెమా మాత్రం రాజాజ్ఞను శిరోధార్యంగా భావించింది. కారులో వెళదామనుకుంటే వాంతులవుతాయని భయం. నాలుగేళ్ల కిందట ఓ సారి ఆమె కారు ప్రయాణం చేసినప్పుడు వాంతులై అనారోగ్యం పాలైందట. డెమాకు అది గుర్తొచ్చి వాహన ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంది. ఏమైతేనేం ఎలాగైనా ఓటు వేసి తీరాలని నిర్మయించుకుంది.
భూటాన్ రాజధాని థింపూలో ఉంటున్న డెమా ఎట్టకేలకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో తన జన్మస్థలం ఉన్న ట్రాషియాంగ్‌స్టే జిల్లాకు కాలినడకన ప్రయాణం కట్టింది. భారీ పర్వత ప్రాంతాల గుండా క్లిష్టంగా సాగే ఈ ప్రయాణంలో ఆమె తన మనుమడితో నడుస్తూ రాత్రిళ్లు ఆయా గ్రామాల్లో బస చేసేది. చివరకు స్వస్థలానికి చేరుకొని తన సమీప బంధువు ఇంట్లోకి వెళ్లగానే వాళ్లంతా కన్నీళ్లపర్యంతమయ్యార్ట. ఎందుకంటే వాళ్లు ఈమెను చూసి దాదాపు నాలుగేళ్లయిందట. అందులోను ఈ వయసులో యుక్త వయసైనా రాని బాలునితో నడచి వచ్చిందన్న సంగతి తెలిసి నోరెళ్లబెట్టారు. చివరకు ఓటేసి ఆనందంగా థింపూ వెళ్లిందట డెమా.
డెమా సంగతి ఇలా ఉంటే... ఓట్లేయడానికి దేశంలోని లక్షల మంది జనం స్వస్థలాలకు నడచి వెళ్లకున్నా... వ్యయానికి లెక్క చేయక వాహనాల్లో వందల మైళ్ల దూరం ప్రయాణం చేసి ఓట్లేశారట. స్వంత ఊళ్లకు వెళుతున్నాం కదా అని బంధువులు, మిత్రులకు భారీగా బహుమానాలు పట్టుకెళ్లారట. బహుమానాలను కొనుగోలు చేయడం కోసం చాలా మంది అప్పులు కూడా చేశారట. ఎన్నికల పుణ్యమా అంటూ వాహనాలన్నీ కిటకిటలాడిపోవడం సంగతి అటుంచి కుటుంబీకులంతా ఒక చోట కలుసుకున్నందుకు ప్రజలంతా సంతోషపడ్డారట. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉంటున్న భూటాన్ జాతీయులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు కేవలం ఓటు వేయడానికి తమ స్వదేశానికి వచ్చినట్లు ది డ్రక్ అనే ఓ హొటల్ యజమాని దిలు గిరి చెప్పారు.
మన దేశంలో ఇలాంటివి ఊహించగలమా... ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లే లోపు ఆ ఓటును మరొకరు కాజేయరూ....
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment