Thursday, December 23, 2010

బాజా మోత... లక్షల దాత...

మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే... మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి)  ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.

1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.

Sunday, December 12, 2010

వృద్ధులు పాటించారు... డాక్టర్ అనుసరించారు

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వృద్ధ దంపతులు ఎస్ ఎస్ పళనియప్పన్ (80), మీనమ్మాళ్ (74) ఒక రోజున తిరునెల్వేలి వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చారు.  మరణానంతరం అవయువదానంగా తమ దేహాల్ని ఈ ఆసుపత్రి వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సమర్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాల్ని ఆసుపత్రి డీన్‌కు అందజేశారు.

పళనియప్పన్ గతంలో శంకరన్ కోవిల్ గ్రామంలో మెడికల్ స్టోర్ ఆపీసర్‌గా పనిచేసేవారు. మరణానంతరం వైద్య పరిశోధనల కోసం తమ దేహాల్ని దానంగా ఇవ్వాలని 40 ఏళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగానూ ఉన్నారు. అవయువదాన ప్రాధాన్యత గురించి తన భార్యతో చర్చించినప్పుడు ఆమెకూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుందని పళనియప్పన్ తెలిపారు. వీరి అభిమతాన్ని కుటుంబ సభ్యులంతా ఏ మాత్రం ప్రశ్నించక గౌరవించారట. ప్రచారం కోసం కాకుండా... అవయువదానం దిశగా మరిందరిని ప్రోత్సహించాలన్న ఆశయంతో తాము ఈ పని చేశామని వివరించారు.

ఇక పళనియప్పన్, మీనమ్మాళ్ దంపతుల ఔదార్యంతో చలించిపోయిన ఆసుపత్రి డీన్ ఎస్ రామగురు సైతం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని తాను కూడా వారితోబాటే తమ ఆసుపత్రికి తన దేహాన్నీ మరణానంతరం అప్పగించేలా పత్రాలు సమర్పించేశారు. మరణించిన వ్యక్తుల నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయువాలు మరెందరికో జీవితాన్నిస్తాయని, సమాజంలో అవగాహన లేకపోవడంతో ఎందరో రోగులు వేదన చెందుతుండటం గురించి తనకు తెలుసని పేర్కొంటూ రామగురు ఆ వృద్ధుల్ని అనుసరించారు.

Monday, November 29, 2010

వైద్యం చేసి పాలబాకీ తీర్చిన డాక్టర్...

అమెరికాలోని ఉత్తర పెన్సిల్వేనియాలో ఓ రోజు ఓ పేదపిల్లవాడు ఇంటింటికి వెళ్ళి సామాను అమ్ముతున్నాడు.  అలా అమ్మితే అతనికి వచ్చే కమీషన్‌తో స్కూలు ఫీజు కట్టుకోవాలి. అతను ఇంట్లోంచి బయలుదేరి చాలాసేపవడమే కాక చాలా దూరం వచ్చేశాడు. అతనికి బాగా ఆకలిగా వుంది. జేబులో చూసుకుంటే అయిదు పెన్నీల నాణెం మాత్రమే వుంది.

తనకి ఆకలిగా వుందని, తినడానికి ఏదైనా పెట్టమని అడుగుదామనుకుని ఆ కుర్రాడు ఓ ఇంటి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తీసి అతని వంక ఏం కావాలన్నట్టుగా చూసింది.  భోజనం అడగడానికి సిగ్గుపడడంతో ఆ పిల్లవాడు తనకి దాహంగా వుందని కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.

ఆ యువతి అతన్ని లోపలికి ఆహ్వానించి ఓ గ్లాసు నిండా చిక్కని పాలు ఇచ్చి తాగమని నవ్వుతూ చెప్పింది.

పాలు మొత్తం తాగాక ఆ కుర్రాడు అడిగాడు.  ఈ పాలకి నేను మీకు ఎంతివ్వాలి?...

నీకు బాగా ఆకలిగా వుందని నాకు తెలుసు కాబట్టి నువ్వడగకపోయినా నా అంతట నేనే నీకు పాలు ఇచ్చాను.  కనుక ఏం ఇవ్వక్కర్లేదు.. చిరునవ్వుతో చెప్పిందా యువతి.

ఏదీ ఉచితంగా తీసుకోవద్దని మా అమ్మ నాకు చెప్పింది. అందుకని మీకు నేను నా హృదయంలోంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.. అని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువతికి జబ్బు చేసింది. ఆ గ్రామంలోని డాక్టర్లకి ఆమె రోగం గురించి అర్ధం కాకపోవడంతో దగ్గరే వున్న ఓ పట్టణంలోని హాస్పటల్‌కి ఆమెని పంపిచారు. ఆ హాస్పటల్లో పనిచేసే డాక్టర్ హావార్డ్ కెల్లీ అనే డాక్టర్‌కి ఆమె కేస్ అప్పగించారు. కేస్ షీట్ అందుకున్న ఆ డాక్టర్‌కి ఆమె స్వగ్రామం పేరు చూడగానే ఆసక్తి కలిగింది. వెంటనే వార్డులోకి వెళ్ళి రోగిని చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు.  తను చిన్నపిల్లవాడుగా వుండగా ఆకలిగొన్న ఓ మధ్యాహ్నం తనకి పాలు ఇచ్చి కడుపునింపిన యువతే ఆవిడ.

ఆ రోజునుంచి కెల్లీ ఆవిడకి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు.  కొద్ది రోజుల్లోనే ఆవిడ జబ్బు నయం అయి హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయింది. డాక్టర్ హావార్డ్ కెల్లీ కోరిక ప్రకారం అకౌంట్సు విభాగం వాళ్ళు ఆవిడ మెడికల్ బిల్‌ని ముందుగా ఆయన దగ్గరికి పంపారు. తర్వాత ఆవిడకి పంపారు.

ఎంత బిల్లు చెల్లించాలో అనే భయంతో ఆవిడ దానివంక చూసింది.  బిల్లు మీద పెద్దక్షరాల్లో రాసిన పదాలు, కింద సంతకం చూసిందావిడ.

పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఒన్ గ్లాస్ ఆఫ్ మిల్క్... అన్న వాక్యాల కింద డాక్టర్ హావార్డ్ సంతకం వుంది.

అమెరికాలో సుప్రసిద్ధ వైద్యుడైన డాక్టర్ హావార్డ్ కెల్లీ (1858 - 1943) వైద్య ప్రపంచానికే ఆదర్శప్రాయుడు.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు

Tuesday, October 26, 2010

అంకవికలుడు... పేదల కంటి జోడు

విజయవాడలోని అరుండేల్ పేటలో ఆప్టికల్ షాపు నడిపే 50 ఏళ్ళ మహ్మద్ అయూబ్ ఖాన్ అంటే పేదలపాలిటి కంటి చూపుగా మెలగుతూ సేవలందిస్తున్నారు. తన 12వ ఏట బడికి వెళుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న ఈయన జైపూర్ కాలుతో నడుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన వద్ద 2,000 రూపాయలు ఉండి ఉంటే ఆ కాలు పోకుండా రక్షించుకునేవాడినని అంటుంటారాయన. అప్పట్లో ఆయనకు డబ్బులేనందువల్ల చికిత్స పొందలేక కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనే ఈయన జీవితాన్ని మలుపుతిప్పింది. తర్వాతికాలంలో జీవితంలో స్థిరపడి ఆప్టికల్ షాపు పెట్టుకున్నారు. తాను సైతం ఇతరులకు చేయూతనివ్వగలనన్న విశ్వాసం చేకూరాక నేత్ర సమస్యలతో బాధపడే పేదలకు అండగా ఉంటూ వస్తున్నారు అయూబ్. ఈయన సేవలు ఏమిటంటే....

కంటి సమస్యలున్న పేదవారి నుంచి ఎలాంటి రుసుమూ తీసుకోకుండా ఆయూబ్ పరీక్షలు చేయిస్తారు. వారికి ఉచితంగా కంటి అద్దాలు సమకూర్చుతారు. తన వద్దకు వచ్చినవారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫ్రేమ్‌కు మాత్రం డబ్బు తీసుకుంటారు. వారు ఇవ్వలేకుంటే అదీ పుచ్చుకోరు. అయూబ్ సేవలకు ఆయన కుమారులు చేయూతనిస్తుంటారు. ఈ ఉచిత కంటి పరీక్షలు, కళ్ళద్దాల పంపిణీ గురించి నగరంలోని ముఖ్య కూడళ్ళలో ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతుంటారు.

ప్రస్తుతం ఎందరో నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులైన పేదవారి కళ్ళద్దాలు విరిగిపోయి ఉన్నప్పటికీ (ఏనాడో కొనుక్కున్నవి) డబ్బులేక వాటినే వాడుకుంటూ ఉంటారని, వాటికి పవర్ కూడా ఉండదని నేటి పరిస్థితిని అయూబ్ వివరించారు.

Tuesday, October 19, 2010

జ్ఞాననేత్రుని కలం నుంచి భీమాయణం

మధ్యప్రదేశ్‌కు చెందిన వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయులైన ప్రభాకర్ జోషి వయసు 84 ఏళ్ళు. గ్లకోమా వ్యాధికారణంగా అంధత్వానికి గురైన జ్ఞాన నేత్రుడు. అయినప్పటికీ సుమారు తన 78 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించారు. అదేమిటంటే... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంస్కృతంలో రచించడం. 2004లో ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన జోషీ మొత్తం 1,577 సంస్కృత శ్లోకాలతో 2010లో "భీమాయణం" పేరిట మన రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను పూర్తి చేశారు.

ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... డాక్టర్ అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పించాలని ఆయన తండ్రి రాంజీకి ఎంతో కోరికగా ఉండేదట. అయితే, ఒకప్పుడు దళితులకు దూరంగా ఉన్న సంస్కృత భాషలో నేడు అంబేద్కర్ చరిత్ర వెలువడటం నిజంగా విశేషమే. ప్రతిష్ఠాత్మక "మహాకవి కాళిదాస్" అవార్డు గ్రహీత అయిన జోషీకి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. అంబేద్కర్ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని వాస్తవాల నుంచి జోషీ గారూ స్ఫూర్తి పొంది "భీమాయణం" రచనకు శ్రీకారం చుట్టారు.

Wednesday, September 29, 2010

జీవితాల్ని అల్లే వాసుదేవన్...

తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురానికి సమీపాన కోటైకాల్ వాసి వాసుదేవన్ (45). ఈయనకు నాలుగున్నరేళ్ళ వయసున్నప్పుడు మశూచి వ్యాధి సోకి కళ్ళుపోయాయి. అదీగాక పిన్న వయసులోనే అమ్మానాన్నలు మరణించారు. ఇక మిగిలిన ఏకైక తోడు తన చెల్లెలే. ఒక పక్క అంధత్వం, మరోపక్క పేదరికం, ఆ పైన చెల్లెలి పోషణ భారం. ఎలాగో శ్రమకోర్చి చెన్నై పూందమల్లి అంధుల పాఠశాలలో 10 తరగతి చదువుకున్నారు. పూర్తిగా కష్టాలు అల్లుకున్న తమ అన్నాచెల్లెళ్ళ జీవితాల్ని గడిపేందుకు వైరు కుర్చీల అల్లిక పని నేర్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి కష్టాలు ఉన్నవారి జీవితాల్లో కనిపించే ఉమ్మడి దృశ్యం ఇదే. కానీ వాసుదేవన్ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఈ మాత్రం జీవితాన్నిచ్చిన సమాజం కోసం తనవంతు ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. దాంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజెప్పడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నప్పుడు సమీప గ్రామాల్లో తిరుగుతూ చదువుకోవాల్సిన అవసరం గురించి స్థానికులకు బోధిస్తుంటారు. పల్లె ప్రజలు వారి పిల్లల్ని చిన్నతనంలోనే పనులకు పంపిస్తుండటం వల్ల గ్రామీణ బాలలు చదువుకు, బాల్యానికి దూరమై జీవితాల్ని చిదిమేసుకోవడం వాసుదేవన్‌ను కలచివేసింది. అందుకనే వాళ్ళ జీవితాల్ని కూడా అల్లే పనిలో పడ్డారు. వాసుదేవన్ వల్ల ఎందరో బాలల జీవితాల్లో కొత్త కోణాలు ఉదయించాయి.

Friday, August 27, 2010

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...

ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న ఏడేళ్ళ అబ్బాయికి రక్తం వెంటనే కావాలని దాని సారాంశం. "ఇదీ అసలైన పని" అంటూ రంగంలోకి దిగారు ప్రకాశరావు.

ప్రకాశరావుగారు తన ఫోనందుకుని మరో ఇద్దరికి ఫోన్ కొట్టారు. 15 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళు అతని దగ్గరికొచ్చి అడ్రెస్ తీసుకుని రక్తం ఇవ్వడం కోసం రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) కి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్ళు ఎవరంటే... ప్రకాశరావు ఏర్పాటు చేసిన రక్తదాతల బృంద సభ్యులు. వీరిలో రకరకాల బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులున్నారు. ప్రకాశరావు పిలుపు అందుకుని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేరారు.

కటక్‌లోని ఎస్ సి బి వైద్యకళాశాల - ఆసుపత్రి (ఒరిస్సాలోని అతిపెద్ద వైద్య సంస్థ)కి వాళ్ళ వైద్యులకంటే ప్రకాశరావు చాలా ముఖ్యమైన వ్యక్తి. కనీసం ప్రతి 10 రోజులకొకమారు తన బృంద సభ్యుల ద్వారా రక్తమిప్పిస్తూ లెక్కకు మిక్కిలిగా రక్తం ధారపోసి వైద్యులకు, రోగులకు కావలసిన మనిషయ్యారు. తాను మాత్రమేగాక మరెందరినో రక్తదానం దిశగా ప్రేరేపించి, రకరకాల బ్లడ్ గ్రూపులున్న దాతల వివరాల్ని సేకరించి సేవ చేస్తున్న ప్రకాశరావును ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.

అసలు ఇది ఎలా మొదలైందంటే... 1978లో ఒకసారి ప్రకాశరావు వెన్నెముకలో కణితి ఏర్పడినప్పుడు ఎస్ సి బి వైద్యకళాశాలలో చికిత్స పొందుతూ మూడు నెలలు అక్కడే ఉన్నారు. చికిత్సకు అవసరమైన రక్తం లేక చనిపోయేవారిని కళ్ళారా చూస్తూ... వారి బాధను తన బాధలా అనుభవించి ఇక తానుకూడా రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తర్వాత తాను కోలుకుని ఆ ఆసుపత్రి నుంచి బయటపడినప్పటికీ... రక్తదాతగా రోజూ అక్కడికెళ్ళి రోగులపాలిట రక్తదాతగా, ప్రాణదాతగా మారారాయన.

రక్తదానమొక్కటే ప్రకాశరావు వ్యాపకం కాదు. మురికివాడల చిన్నారుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. టీ దుకాణం నుంచి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం 500 రూపాయలు. అందులో 150 రూపాయలు ఈ పిల్లల చదువులు, అనాథలకోసం ఖర్చు చేస్తారు. ఈ సేవలో ప్రకాశరావు భార్యా పిల్లలు సైతం ఆయనకు చేదోడుగా ఉండటం తన జీవితంలోని మరో కొత్తకోణంగా ఆయన చెబుతారు.

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్ అంటే... ఇదీ.

Monday, August 23, 2010

టవర్స్‌కు అందని ప్రేమ... లెవిస్‌పోర్ట్ ఆతిథ్యం

అమెరికాలో ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో అప్పటికప్పుడే ప్రభుత్వం దింపించేసింది. ఈ క్రమంలో న్యూ ఫౌండ్‌లేండ్ వద్ద జేండర్ అనే చిన్న ఊరికి సమీపాన గల విమానాశ్రయంలో సుమారు 55 విమానాలు దిగి అక్కడే ఆగిపోయాయి. వాటన్నిటిలో కలిపి 10,500 మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉన్నట్టుండి దిగిన జేండర్ గ్రామ ప్రజల సంఖ్య 10,400. ఆ ఉరి ప్రజల సంఖ్యకు సమానంగా ఉన్న విమాన ప్రయాణీకులకు తగినన్ని హొటళ్ళు, సదుపాయాలు ఆ ఊరిలో అంతగా లేవు. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు ప్రయాణీకుల్ని అక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిస్‌పోర్ట్ అనే మరో ఊరికి పంపారు.

ఈ అతిథుల కోసం లెవిస్‌పోర్ట్ గ్రామస్తులు స్కూళ్ళకు సెలవులిచ్చి, కమ్యూనిటీ హాళ్ళలో బస ఏర్పాటు చేశారు. విమానప్రయాణీకులందరిని సౌకర్యంగా ఉంచేందుకుగాను మంచాలు, స్లీపింగ్ బ్యాగ్స్, దిళ్ళు, దుప్పట్లు అందించారు. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే ముసలివారు, గర్భవతులు, రోగులకు ఆసుపత్రికి సమీపంలోను, ఆడవారికి తోడుగా ఆడవారే ఉండేలా, కుటుంబ సభ్యులంతా ఒకచోటే ఉండేలా బస ఏర్పాటు చేశారు. వీరికోసం రాత్రివేళల్లోనూ బేకరీలు, హోటళ్ళు తెరిపించారు. స్కూళ్ళలో ఉన్నవారికోసం లెవిస్‌పోర్ట్ ప్రజలు స్వయంగా వంట చేసిపెట్టారు. ఈ ప్రయాణీకులు అక్కడెన్నాళ్ళుంటారో తెలియదు. అయినా విసుగుచెందక వారికి కాలక్షేపం కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు ఎక్స్‌కర్షన్స్, పడవ ప్రయాణాలు ఏర్పాటు చేశారు.

అతిథులు లాండ్రి మేట్‌లకు వెళ్ళి దుస్తులు ఉతుక్కోవడానికి ఉచితంగా టోకెన్లు ఇచ్చారు. వీరికి ఇబ్బందులు కలుగకుండా స్కూల్ స్టూడెంట్స్‌ని స్వచ్ఛంద సేవకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్నిరకాలుగా సాయం చేసారు. ఒక రెండుమూడు రోజులు గడిచాక విమానాలు ఒకొక్కటిగా వెళుతున్నాయి. ఏ ఒక్కరూ ఫ్లయిట్ మిస్ కాకుండా అందర్నీ జాగ్రత్తగా విమానాలు ఎక్కించారు.

ఇలా వెళుతున్న విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్ విమానం ఒకటి. ఇందులోని ప్రయాణీకులంతా కలసి తమకు ఆతిథ్యమిచ్చిన లెవిస్‌పోర్ట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డెల్టా 15 (తమ విమానం నెంబర్) ట్రస్ట్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. తాము బస చేసిన స్కూలు విద్యార్థులు కాలేజీలో చేరడానికి వీలుగా స్కాలర్‌షిప్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసిన ఒక ప్రయాణీకుని కంపెనీ మరి కొంత మొత్తం సాయం చేసింది. ఈ సంగతి తెలిసిన డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇంకొంత మొత్తం చేర్చింది. ఈ చక్కని ఆలోచన గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న మిగిలిన విమానాల్లోని ప్రయాణీకులు తమ వంతుగా డబ్బు పంపారు. దీంతో ఒక పెద్ద ఫండ్ ఏర్పడి లెవిస్‌పోర్ట్ విద్యార్థులకు సాయం అందుతోంది. నేటికీ ఆనాటి విమాన ప్రయాణీకులు వారి పుట్టినరోజు, పెళ్ళిరోజుల్లో ఈ ఫండ్‌కు డబ్బు పంపుతూ చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో కొత్తకోణాల్ని పూయిస్తున్నారు. కూలిన ట్విన్ టవర్స్ కంటే ఎత్తయిన కట్టడాలు ప్రపంచంలో ఎన్నో ఉండవచ్చుగాక... వాటన్నిటికీ అంతనంత ఎత్తయింది తమ ప్రేమ అని ఇరువురూ చాటారు.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Monday, July 26, 2010

మొక్కలు మొక్కే మనిషి

ఖమ్మం జిల్లావాసి దరిపల్లి రామయ్య ఎప్పుడు కనిపిస్తాడా.. ఆయనకు ఎప్పుడు మొక్కుదామా అని చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆయన్ని తమ కొమ్మలతో కావలించుకుని.. స్పృశించి తరించాలని తరులన్నీ ఆశపడుతుంటాయి. అయన తన తలకు "వృక్షో రక్షతి రక్షితః" అన్న నినాదం రాసి ఉన్న ఒక చక్రంలాంటి అట్టను తలకు ధరించి, మొక్కలతో సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ వాటిని పెంచమని అందరికీ పంచుతూ ఉంటాడు. మొక్కలు, చెట్లు... వాటి ఉపయోగాలపై చిన్నప్పుడెప్పుడో తన గురువుగారు చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ఈ సత్కార్యానికి పూనుకున్నారు రామయ్యగారు. మొక్కలు పంచడమేగాక వాటిని గురించి వనసూక్తులు, పాటలు రచించి గానం చేస్తుంటారు. తన జీవితకాలంలో కనీసం కోటి మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. రామయ్యగారి కోరిక నెరవేరాలని మనమంతా కోటి దేవతల్ని వేడుకుందాం. ఇక రామయ్యగారి భార్యామణి (పేరు తెలియదు) కూలి పని చేసుకుంటూ తన భర్త ఉన్నతాశయానికి అండగా నిలుస్తున్నారు.

Monday, May 31, 2010

అంగదాతా జయీభవ

వికలాంగుడైన గూడూరి నలినేష్ బాబు (45) గుంటూరు జిల్లా మందడం గ్రామవాసి. తనకు పాదాలు లేకపోయినా... తనలా పాదాల్లేని వేలాదిమందికి కృత్రిమ పాదాలందించి పాదదాతగా వారి జీవితాల పాలిట ప్రాణదాత అయ్యారు. నలినేష్ బాబుకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి. నలినేష్ తల్లిదండ్రులు ఆయనకు కృత్రిమ పాదాలు అమర్చడం కోసం ఏటా జైపూర్ తీసుకెళ్ళి 7,000 రూపాయలకు పైగా ఖర్చుపెట్టేవారు.

తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.

అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.

అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్‌ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....

Friday, April 30, 2010

నరికినందుకు నాటే శిక్ష

సుందర్ వాసుదేవ అనే పెద్ద మనిషి తన చిన్న మనసుతో 2003లో తాజ్‌పూర్ అనే గ్రామంలో 42 పీపల్ చెట్లను నేలకూల్చాడు. ఆయన ఢిల్లీ నగర వాసి. వాసుదేవ చేసిన తప్పును తీవ్రంగా పరిగణించి ఆయనపై "వృక్ష పరిరక్షణ చట్టం" కింద కేసు పెట్టారు. మామూలుగా అయితే ఆయన చేసిన తప్పుకుగాను ఆ చట్టం నిబంధనల మేరకు జరిమానా విధిస్తారు. అయితే ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి దేవేందర్ కుమార్ భిన్నమైన శిక్షను విధించారు. అదేంటంటే... నరికిన ఒక్కో చెట్టుకూ పరిహారంగా ఐదేసి మొక్కల చొప్పున నాటాలి. అంటే వాసుదేవ మొత్తం 210 మొక్కలు నాటాలన్నది ఈ శిక్ష సారాంశం. అంతేగాక ఆయన ప్రవర్తనపై నిఘా ఉంటుందని, ఆరునెలల పాటు పరిశీలనలో ఉంటారని తెలియజేసి ప్రొబేషన్ మీద విడిచిపెట్టారు. ప్రాణవాయువునిచ్చి మానవాళి ప్రాణాలు కాపాడే వృక్ష దేవతల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ న్యాయమూర్తిగారు వనదేవతల జీవితాల్లో కొత్తకోణాలు పూయించిన పుణ్యమూర్తి.

Tuesday, March 30, 2010

కూలీల బండిలో అన్నమ్మూట

మీరెవరైనా కర్నూలు జిల్లాలో ఉన్న కృష్ణాపురం వెళితే అక్కడ ఓ పేద జంట కనిపిస్తుంది. వాళ్ళు బండి మీద రోజూ ఒక మూట పట్టుకెళుతుంటారు. ఎవరి కోసమో వెదుకుతుంటారు. అదేదో కూలిపని కోసం మోసుకెళ్ళే మూట అనుకుంటే మీరు పొరబడినట్లే... అదేమిటంటే... ఓ బండెడు అన్నం మూట. ఎవరికంటే, దారిలో ఏ జంతువు కనిపిస్తే దానికే. వీరు కొన్నేళ్ళుగా ఈ అన్నదాన యజ్ఞం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ.

Saturday, February 27, 2010

కరెన్ చదువు మానలేదు...

ఇది చాలా రోజుల కిందటి సంగతి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ అనే ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడి విద్యార్థులంతా తమ బడిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకటి అందమైన పూల మొక్కల్ని నాటడం. ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు. పిల్లలంతా వారి వారి ఇళ్ళలో చేసుకున్న ఆహారపదార్ధాల్ని అమ్మి నాలుగు వందల డాలర్లను పోగేశారు. ఇక మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒక తేదీ నిర్ణయించి, ఆ రోజున విద్యార్థులు, వారి అమ్మానాన్నలు రావాలని పాఠశాల యాజమాన్యం అందరికీ కబురంపింది. అయితే, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొని ఎక్కువ మొత్తం సంపాదించడంలో ముందున్న నాలుగో తరగతి బాలిక కరెన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేమని తన స్నేహితులకు చెప్పింది. అసలు సంగతి ఏమిటంటే, పాపం ఆ అమ్మాయి తండ్రికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వలేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. దాంతో వారు ఊరు చివర తక్కువ ధరకు మరో చిన్న ఇంటికి మారాలనుకుంటున్నట్లు అందరికీ తెలిసింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే చిన్నారి కరెన్ ఇక బడికి రాదని తెలిసింది. ఇది మరో షాక్...

కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Tuesday, January 26, 2010

చూడలేని కామెంటేటర్...

జింబాబ్వేకు చెందిన డీన్ డు ప్లెసిస్‌కు ఒక తిరుగులేని సామర్థ్యముంది. అదేంటంటే... మ్యాచ్ చూడకుండానే కామెంట్రీ చెయ్యడం. కళ్లు లేకున్నా స్పందనలు, శబ్దాలను బట్టి క్రికెట్ పిచ్‌లో ఏం జరిగిందనేది పసిగట్టి కామెంట్రీ చేస్తాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తాను.