అమెరికాలోని ఉత్తర పెన్సిల్వేనియాలో ఓ రోజు ఓ పేదపిల్లవాడు ఇంటింటికి వెళ్ళి సామాను అమ్ముతున్నాడు. అలా అమ్మితే అతనికి వచ్చే కమీషన్‌తో స్కూలు ఫీజు కట్టుకోవాలి. అతను ఇంట్లోంచి బయలుదేరి చాలాసేపవడమే కాక చాలా దూరం వచ్చేశాడు. అతనికి బాగా ఆకలిగా వుంది. జేబులో చూసుకుంటే అయిదు పెన్నీల నాణెం మాత్రమే వుంది.
తనకి ఆకలిగా వుందని, తినడానికి ఏదైనా పెట్టమని అడుగుదామనుకుని ఆ కుర్రాడు ఓ ఇంటి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తీసి అతని వంక ఏం కావాలన్నట్టుగా చూసింది. భోజనం అడగడానికి సిగ్గుపడడంతో ఆ పిల్లవాడు తనకి దాహంగా వుందని కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.
ఆ యువతి అతన్ని లోపలికి ఆహ్వానించి ఓ గ్లాసు నిండా చిక్కని పాలు ఇచ్చి తాగమని నవ్వుతూ చెప్పింది.
పాలు మొత్తం తాగాక ఆ కుర్రాడు అడిగాడు. ఈ పాలకి నేను మీకు ఎంతివ్వాలి?...
నీకు బాగా ఆకలిగా వుందని నాకు తెలుసు కాబట్టి నువ్వడగకపోయినా నా అంతట నేనే నీకు పాలు ఇచ్చాను. కనుక ఏం ఇవ్వక్కర్లేదు.. చిరునవ్వుతో చెప్పిందా యువతి.
ఏదీ ఉచితంగా తీసుకోవద్దని మా అమ్మ నాకు చెప్పింది. అందుకని మీకు నేను నా హృదయంలోంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.. అని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువతికి జబ్బు చేసింది. ఆ గ్రామంలోని డాక్టర్లకి ఆమె రోగం గురించి అర్ధం కాకపోవడంతో దగ్గరే వున్న ఓ పట్టణంలోని హాస్పటల్‌కి ఆమెని పంపిచారు. ఆ హాస్పటల్లో పనిచేసే డాక్టర్ హావార్డ్ కెల్లీ అనే డాక్టర్‌కి ఆమె కేస్ అప్పగించారు. కేస్ షీట్ అందుకున్న ఆ డాక్టర్‌కి ఆమె స్వగ్రామం పేరు చూడగానే ఆసక్తి కలిగింది. వెంటనే వార్డులోకి వెళ్ళి రోగిని చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు. తను చిన్నపిల్లవాడుగా వుండగా ఆకలిగొన్న ఓ మధ్యాహ్నం తనకి పాలు ఇచ్చి కడుపునింపిన యువతే ఆవిడ.
ఆ రోజునుంచి కెల్లీ ఆవిడకి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు. కొద్ది రోజుల్లోనే ఆవిడ జబ్బు నయం అయి హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయింది. డాక్టర్ హావార్డ్ కెల్లీ కోరిక ప్రకారం అకౌంట్సు విభాగం వాళ్ళు ఆవిడ మెడికల్ బిల్‌ని ముందుగా ఆయన దగ్గరికి పంపారు. తర్వాత ఆవిడకి పంపారు.
ఎంత బిల్లు చెల్లించాలో అనే భయంతో ఆవిడ దానివంక చూసింది. బిల్లు మీద పెద్దక్షరాల్లో రాసిన పదాలు, కింద సంతకం చూసిందావిడ.
పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఒన్ గ్లాస్ ఆఫ్ మిల్క్... అన్న వాక్యాల కింద డాక్టర్ హావార్డ్ సంతకం వుంది.
అమెరికాలో సుప్రసిద్ధ వైద్యుడైన డాక్టర్ హావార్డ్ కెల్లీ (1858 - 1943) వైద్య ప్రపంచానికే ఆదర్శప్రాయుడు.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు
Print this post
Monday, November 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Nice
INSPIRING ND ALSO PRACTISABLE ND FOLLOWEBLE
wonderful (real) story.
Post a Comment