వికలాంగుడైన గూడూరి నలినేష్ బాబు (45) గుంటూరు జిల్లా మందడం గ్రామవాసి. తనకు పాదాలు లేకపోయినా... తనలా పాదాల్లేని వేలాదిమందికి కృత్రిమ పాదాలందించి పాదదాతగా వారి జీవితాల పాలిట ప్రాణదాత అయ్యారు. నలినేష్ బాబుకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి. నలినేష్ తల్లిదండ్రులు ఆయనకు కృత్రిమ పాదాలు అమర్చడం కోసం ఏటా జైపూర్ తీసుకెళ్ళి 7,000 రూపాయలకు పైగా ఖర్చుపెట్టేవారు.
తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.
అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.
అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్‌ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment