ఇది చాలా రోజుల కిందటి సంగతి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ అనే ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడి విద్యార్థులంతా తమ బడిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకటి అందమైన పూల మొక్కల్ని నాటడం. ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు. పిల్లలంతా వారి వారి ఇళ్ళలో చేసుకున్న ఆహారపదార్ధాల్ని అమ్మి నాలుగు వందల డాలర్లను పోగేశారు. ఇక మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒక తేదీ నిర్ణయించి, ఆ రోజున విద్యార్థులు, వారి అమ్మానాన్నలు రావాలని పాఠశాల యాజమాన్యం అందరికీ కబురంపింది. అయితే, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొని ఎక్కువ మొత్తం సంపాదించడంలో ముందున్న నాలుగో తరగతి బాలిక కరెన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేమని తన స్నేహితులకు చెప్పింది. అసలు సంగతి ఏమిటంటే, పాపం ఆ అమ్మాయి తండ్రికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వలేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. దాంతో వారు ఊరు చివర తక్కువ ధరకు మరో చిన్న ఇంటికి మారాలనుకుంటున్నట్లు అందరికీ తెలిసింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే చిన్నారి కరెన్ ఇక బడికి రాదని తెలిసింది. ఇది మరో షాక్...
కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.
Print this post
Saturday, February 27, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment