Friday, August 27, 2010

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...

ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న ఏడేళ్ళ అబ్బాయికి రక్తం వెంటనే కావాలని దాని సారాంశం. "ఇదీ అసలైన పని" అంటూ రంగంలోకి దిగారు ప్రకాశరావు.

ప్రకాశరావుగారు తన ఫోనందుకుని మరో ఇద్దరికి ఫోన్ కొట్టారు. 15 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళు అతని దగ్గరికొచ్చి అడ్రెస్ తీసుకుని రక్తం ఇవ్వడం కోసం రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) కి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్ళు ఎవరంటే... ప్రకాశరావు ఏర్పాటు చేసిన రక్తదాతల బృంద సభ్యులు. వీరిలో రకరకాల బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులున్నారు. ప్రకాశరావు పిలుపు అందుకుని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేరారు.

కటక్‌లోని ఎస్ సి బి వైద్యకళాశాల - ఆసుపత్రి (ఒరిస్సాలోని అతిపెద్ద వైద్య సంస్థ)కి వాళ్ళ వైద్యులకంటే ప్రకాశరావు చాలా ముఖ్యమైన వ్యక్తి. కనీసం ప్రతి 10 రోజులకొకమారు తన బృంద సభ్యుల ద్వారా రక్తమిప్పిస్తూ లెక్కకు మిక్కిలిగా రక్తం ధారపోసి వైద్యులకు, రోగులకు కావలసిన మనిషయ్యారు. తాను మాత్రమేగాక మరెందరినో రక్తదానం దిశగా ప్రేరేపించి, రకరకాల బ్లడ్ గ్రూపులున్న దాతల వివరాల్ని సేకరించి సేవ చేస్తున్న ప్రకాశరావును ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.

అసలు ఇది ఎలా మొదలైందంటే... 1978లో ఒకసారి ప్రకాశరావు వెన్నెముకలో కణితి ఏర్పడినప్పుడు ఎస్ సి బి వైద్యకళాశాలలో చికిత్స పొందుతూ మూడు నెలలు అక్కడే ఉన్నారు. చికిత్సకు అవసరమైన రక్తం లేక చనిపోయేవారిని కళ్ళారా చూస్తూ... వారి బాధను తన బాధలా అనుభవించి ఇక తానుకూడా రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తర్వాత తాను కోలుకుని ఆ ఆసుపత్రి నుంచి బయటపడినప్పటికీ... రక్తదాతగా రోజూ అక్కడికెళ్ళి రోగులపాలిట రక్తదాతగా, ప్రాణదాతగా మారారాయన.

రక్తదానమొక్కటే ప్రకాశరావు వ్యాపకం కాదు. మురికివాడల చిన్నారుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. టీ దుకాణం నుంచి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం 500 రూపాయలు. అందులో 150 రూపాయలు ఈ పిల్లల చదువులు, అనాథలకోసం ఖర్చు చేస్తారు. ఈ సేవలో ప్రకాశరావు భార్యా పిల్లలు సైతం ఆయనకు చేదోడుగా ఉండటం తన జీవితంలోని మరో కొత్తకోణంగా ఆయన చెబుతారు.

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్ అంటే... ఇదీ. Print this post

8 comments:

వాసు.s said...

"ప్రతి 10 రోజులకొకసారి రక్తమిస్తూ"
>> ప్రతి 10 రోజులకొకసారి రక్తమివ్వడం ఆరొగ్యకరం కాదనుకుంటా. ఏదైనా ఆయన చేస్తున్నపని అత్యద్భ్యుతం.

worthlife said...

వాసుగారూ... చిన్న పొరపాటు దొర్లింది. అంటే 10 రోజులకొకమారైనా తాను గానీ, తన బృంద సభ్యుల ద్వారా గానీ రక్తదానం జరుగుతుందని ఇక్కడ చెప్పదల్చుకున్నాను. టపాలో సరిచేశాను. నన్ను అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు.

cbrao said...

దొరుకునా ఇటువంటి సేవా! ఇది కదా నిస్వార్ధ సేవ అంటే. తెలుగు బ్లాగులలో విభిన్నమైన, ప్రయోజనకరమైన బ్లాగిది. భేషో!
cbrao
Mountain View (CA)

worthlife said...

సీబీ రావుగారూ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

maa godavari said...

స్రీనివస కుమార్
అభినందనలు.మీ బ్లాగ్ చూసాను.కొన్ని పోష్టులు చదివాను.
మానవత్వం పరిమళించే మంచివాళ్ళ గురించిన పరిమళాలు మీ బ్లాగ్లో వెల్లివిరిస్తున్నాయి.
ఎక్కడ చూసినా నెగెటివ్ భావాలే కనబడుతున్న వేళ మీరు మనుషుల్లో వ్యక్తమౌతున్న పాజిటివ్ అంశాలను వెతికి పట్టుకుని వాటికి మీ బ్లాగ్ ద్వారా ప్రచారం చెయ్యడం బావుంది.
పి.వి.జ్ఞాన సమాధి దగ్గర మీరు,సుజాత,ప్రకాష్? ప్రవీణ్?
పేరు సరిగా తెలియదు కలిసి దిగిన ఫోటో చాలా బాగా వచ్చింది. సుజాతకు మెయిల్ చేస్తాను.
మీ అందరితో నడిచిన తెలుగు నడక మీద నా బ్లాగ్ లో చిన్నగా రాసాను.వీలైతే చూడండి.

worthlife said...

సత్యవతిగారూ నమస్కారం,

భూమిక ద్వారా మహిళాలోకానికి విశేషమైన సేవ చేస్తున్న మీ అభిప్రాయం నాకెంతో విలువైంది. మీ వంటివారి ప్రోత్సాహంతో ఇటువంటి మరెన్నో వివరాలు అందించేందుకు ప్రయత్నిస్తాను.

ap said...

అభినందనలు.మీ బ్లాగ్ చూసాను.కొన్ని పోష్టులు చదివాను.
మానవత్వం పరిమళించే మంచివాళ్ళ గురించిన పరిమళాలు మీ బ్లాగ్లో వెల్లివిరిస్తున్నాయి.
Telugu News

భాస్కర రామిరెడ్డి said...

శ్రీనివాసకుమార్ గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం