నాన్నా, ఈ కుర్రాడెవరు ? అని వార్తాపత్రిక చదువుతున్న తన తండ్రిని అందులో ఉన్న ఫొటో గురించి అడిగాడు ఐదేళ్ల సంజీవ్ కుమార్.
"అతనికి గుండె జబ్బు బాబూ. సాయం చెయ్యమని అడుగుతున్నారు. ఆపరేషన్ చెయ్యకపోతే చచ్చిపోతాట్ట" అని బదులిచ్చాడు తండ్రి వేణుగోపాల్.
"ఆ సాయం మనం చెయ్యలేమా నాన్నా ?" అడిగాడు సంజీవ్.
"అంత డబ్బు మన దగ్గర లేదుగా..." బదులిచ్చాడు నాన్న.
"సరేగానీ, నాకు ఈ దీపావళికి ఎన్ని రూపాయల బాణసంచా కొనిస్తావ్?" చెప్పు అనడిగాడు ఈ చిన్నారి.
తండ్రికి ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా... "ఓ 2,500 రూపాయలవి కొంటా" అని చెప్పాడు నాన్న.
"అయితే, ఆ డబ్బు ఆ అబ్బాయికిచ్చి సాయం చేద్దాం." అని సంజీవ్ చెప్పగానే ఒక్కసారి ఆ కన్న తండ్రికి ఒళ్లు పులకరించి గగుర్పొడిచింది. చిన్న పిల్లాడికి వచ్చిన ఆలోచన తనకు రాకపోవడం పట్ల సిగ్గుపడ్డాడు కూడా.
ఈ సంఘటన 2003లో జరిగింది. ఆ రోజు మొదలుకొని చిన్నారి సంజీవ్ తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో ఓ 50 మందికి పైగా ఆపన్నులను ఆదుకున్నాడు. ఈ సాయాన్ని అతను పోస్ట్ ద్వారా పంపిస్తాడు. సాయమందుకున్నవారు కృతజ్ఞతతో రాసే ఉత్తరాల్ని చూచి పరమానందం పొందుతుంటాడు ఈ చెన్నై చిన్నారి.
హాకీ వీరుడుకూడా అయిన ఈ బాలకర్ణుడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తమిళనాడు తరఫున పలు అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాడు. మంచి హాకీ క్రీడాకారునిగా ఎదిగి ఆ డబ్బుతో తన సేవలను కొనసాగిస్తాట్ట. ఈ బుల్లి కర్ణుడి ఆశయం ఎన్నో జీవితాలకు కోత్త కోణాల్ని చూపించాలని ఆశిద్దాం.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment