అతనూ ఓ భగ్న ప్రేమికుడే ! ప్రేమించిన పాపానికి కుటుంబానికి దూరమై, అవమాన భారాన్ని మోసినవాడే ! అందుకే తనలాంటి వారి కోసం చెన్నైలో ఇండియన్ లవర్స్ పార్టీ (ఐఎల్‌పీ)ని ప్రారంభించాడు. మొన్న 14 తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలోని కోడంబాక్కంలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. ఇంతకూ ఇతనెవరంటారా ? చెన్నైకి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకుమార్. ప్రస్తుతం ఐఎల్‌పీలో 5000 మంది సభ్యులు చేరగా ఇందులో 3000 మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల యువతులేనట (ప్రేమలో ఎక్కువగా మోసపోయేది యువతులేగా...)
ఐఎల్‌పీకీ ఓ జెండా... ఓ ఎజెండా కూడా ఉన్నాయండోయ్... హృదయంపై బాణం, మధ్యలో తాజ్‌మహల్ ఈ పార్టీ గుర్తు. ఇక ఎజెండా ఏమిటంటే... ఎన్ని ఆటంకాలెదురైనా ప్రేమకు లక్ష్యం పెళ్లేనన్న కృతనిశ్చయంతోనే పార్టీ సభ్యులను (ప్రేమికులు) ముందుకు నడిపించడం. ప్రేమ ఎంతో విలువైనదని, దీనిని అర్థం చేసుకోలేని కొందరు ప్రేమికుల దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అన్నట్టు... ఈ ఏడాది వేలంటైన్స్ డేను శ్రీకుమార్ ఘనంగా జరిపాడు. చెన్నైలో ప్రేమ పుష్పాలు ఎక్కువగా వికసించే మెరీనా బీచ్, ఇలియట్స్ బీచ్, పార్కులకు వెళ్లి 'వాలెంటైన్స్ డే వర్థిల్లాలి' అనే నినాదం ఉన్న పోస్టర్లు అంటించాడు. కనిపించిన ప్రేమికులందరికీ గులాబీలు పంచి శుభాకాంక్షలు తెలిపాడు. అదే సమయంలో ఐఎల్‌పీ సభ్యులెవరూ వెకిలి చేష్ఠలకు పాల్పడకుండా, సమాజంలో అప్రతిష్ఠపాలు కాకుండా మార్గదర్శకాలు, నియమ నిబంధనలను కూడా రూపొందించాడు. ప్రేమికుల జీవితాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మజ్ను.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment