Friday, December 26, 2008

సునామీ నువ్వెంత?

సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?

అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే. Print this post

No comments: