Friday, December 26, 2008

సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!

జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.

అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా. Print this post

No comments: