అది 2001వ సంవత్సరం. చెన్నైకి చెందిన సుప్రజ బీసెంట్ నగర్ సమీపానగల నీలాంగరై బీచ్‌లో వాకింగ్‌కు వెళ్లారు. బీచ్‌లో ఓ వస్తువు కోసం కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. మొత్తం మీద ఓ కుక్క దాన్ని నోట కరచుకొని కంగారుగా పరిగెడుతుండగా ఆ వస్తువు సుప్రజ కాళ్ల ముందు పడింది. తీరా చూస్తే... అది అలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్ల. ఆ క్షణంలోనే సుప్రజ మదిలో ఉదయించింది తాబేళ్ల సంక్షేమం కోసం కృషి చేసే 'ట్రీ ఫౌండేషన్'.
నీలాంగరై బీచ్‌లో అడుగడుగునా తాబేలు గుడ్లు.... వాటి నుంచి బయటకు వచ్చే తాబేలు పిల్లలు కనిపిస్తుంటాయి. అక్కడి జాలరి కుటుంబాలు ఈ తాబేలు గుడ్లను వండుకోవడం... ఒక్కోసారి ఈ పిల్లల్ని తమ పిల్లలకు ఆట వస్తువులుగా ఇవ్వడం తాబేళ్ల సంతతికి ముప్పుగా పరిణమించడం సుప్రజను కదిలించింది. ఈ పరిణామాల మధ్య ఆవిర్భవించిన ట్రీ ఫౌండేషన్ తాబేళ్ల రక్షణ దిశగా అక్కడి జాలర్ల గ్రామాల్లోని మత్స్యకారులకు, నౌకాశ్రయ సిబ్బందికి స్లయిడ్ షోల ద్వారా అవగాహన కలిగించేందుకు ఉద్యమించింది.
ట్రీ ఫౌండేషన్‌లో ఉన్న సుమారు 500 మంది సభ్యులు వివిధ గ్రామాలను దత్తత తీసుకొని తాబేళ్ల వల్ల కడలికి కలిగే ప్రయోజనాలు, పర్యావరణపరంగా వాటి ఆవశ్యకతపై పాఠాలు చెబుతుంటారు. 2001 నాటి సంఘటన తర్వాత పౌండేషన్ అధినేత్రి సుప్రజ మద్రాసులోని క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్‌లో చేరి, సముద్ర తాబేళ్ల నిపుణుడైన కార్తీక్ శంకర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని 2002లో ట్రీ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టారు.
అలివ్ రిడ్లీ జాతి తాబేళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం... ఇవి 60 నుంచి 150 గుడ్ల వరకూ పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతాయి. సుమారు 50 నుంచి 55 రోజుల తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చిన తాబేలు పిల్లలు తమంత తాముగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత 12 నుంచి 14 ఏళ్ల కాలంలో ఆ తాబేళ్లు తాము పుట్టిన తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. సృష్టిలో ఎంతో అరుదైన విషయం ఇది.
తాబేళ్ల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ట్రీ ఫౌండేషన్ వైనం ఇది.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment