బీహార్ రాష్ట్రం పూర్ణే జిల్లాలోని బైసీ అనే పల్లెటూరులో ఉంటున్న ఫర్జానా అనే 15 ఏళ్ల బాలిక కోసం 2 వేల డాలర్ల డబ్బుతో వెదుక్కుంటూ వచ్చాడు హాంగ్‌కాంగ్ నుంచి పనిచేస్తున్న సుప్రీం మాస్టర్ చింగ్ హాయ్ ప్రపంచ సంఘ ప్రతినిధి యెటు కెన్. ఫర్జానా చేతికి డబ్బిచ్చి, భలే ధైర్య సాహసాలు ప్రదర్శించావంటూ మెచ్చుకొని ప్రశంసా పత్రం కూడా అందించి వెళ్లాడు. ఫర్జానా సాహసం గురించి తెలుసుకున్న స్థానిక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా కానుకలందించారు. డబ్బులేక ఆమె చదువు మానేసిందని తెలుసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఫర్జానా చదువుకయ్యే ఖర్చు తాము భరిస్తామంటూ పాఠశాలలో చేర్పించారు. అసలు ఫర్జానా ఏం చేసిందో తెలుసుకుందాం...
నిరుపేద కుటుంబానికి చెందిన ఫర్జానా ఆ రోజు పనార్ నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటోంది. అల్లంత దూరంలో బోలెడు మోటార్ సైకిళ్లు, మరో 15 మందితో ఓ పెద్ద పడవ వెళుతోంది. పాపం తనకూ అలాంటి మోటార్ సైకిల్ పైన తిరగాలని ఉన్నా... కుదరదుగా. ఎందుకంటే నాన్న జమిల్ అహ్మద్‌కు కష్టపడటమే తప్ప వెనకేసుకోవడం తెలీదు.... కుటుంబం ఎలా గడుస్తుందే ఏమిటోనన్న ఆలోచనలతో బట్టల మురికి వదిలిస్తోంది. పరవళ్లు తొక్కుతున్న పనార్ ప్రవాహంతో సమానంగా ఆమె ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి....
రక్షించమంటూ కేకలు వినిపించడంతో ఆలోచనలకు అడ్డుకట్ట వేసి అటూవైపు చూసిందామె. ఇంకేముంది... తాను దేని గురించి ఆలోచిస్తోందో ఆ మోటార్ సైకిళ్లున్న పడవ నదిలో తిరగబడింది. జనాల హాహాకారాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫర్జానా ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే నదిలోకి దూకి ఓ మహిళ, ఇంకో ముగ్గురు పిల్లలు, మరో లావుపాటి పెద్దాయనతో పాటు మొత్తం ఐదుగురి ప్రాణాలు కాపాడింది. పదిహేనేళ్ల బక్కపిల్ల ఫర్జానా నీట మునుగుతున్న ఐదుగురి ప్రాణాలను కాపాడేందుకు ఎంత కిందామీదా పడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఈ సాహసానికి పూనుకుంది.
పేదరికం కారణంగా చదువుకు దూరమైన ఫర్జానా ఎంతో చురుకైన పిల్ల. గ్రామీణ భారతంలోని మామూలు బాలికల్లా క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య జీవిస్తూనే తాను మాత్రం ఈత చాలా బాగా నేర్చుకుంది. అదే ఆ రోజున ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆ జీవితాల్లో కొత్త కోణాలను పూయించింది.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment