Wednesday, June 13, 2007

అంధులు కాదు... సుస్వర బంధువులు

రవితేజ, భూమిక, గోపిక నటించిన "నా ఆటోగ్రాఫ్..." సినిమాలో "మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతోంది" అనే పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో భూమికతో నటించిన అంధ గాయకుడు, తమిళనాడు వాసి అయిన కోమగన్ కూడా మొక్కలాగా మౌనంగానే ఎదిగాడు. ఆ పాటలో కనిపించే వాద్య కళాకారులంతా మొక్క నుంచి మహావృక్షంగా ఎదిగిన కోమగన్ నీడలో సంగీత ఫలాలను ఆరగిస్తూ రాగభావాలను ఒలికిస్తుంటారు. వాళ్లెవరికీ కళ్లులేవు... అయినా గుండెగూళ్లలో సుస్వరాల గుళ్లు కడుతూనే ఉంటారు. ఈ సంగీత బృందం పేరు రాగప్రియ, దాని నిర్వాహకుడే ఆ కోమగన్.

సామాజిక బాధ్యతనెరిగిన ఈ (అను)రాగప్రియ బృందం తమ కచేరీల ద్వారా సంపాదించిన డబ్బును తమలాంటి శాపగ్రస్తుల కోసమే వినియోగిస్తూ సద్వినియోగం చేస్తుంటుంది. ఆ మధ్య ఎయిడ్స్ బాధిత బాలల కోసం కోమగన్ జట్టు 40 వేల రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. అలాగే వికలాంగ సంక్షేమానికి కూడా ఈ రాగప్రియ బృందం ధన సహాయం చేసింది. ఈ అంధ కళాకారుల ఉదారతకు ఇదో మచ్చుతునక మాత్రమే... ఆ మధ్య చెన్నైలో ఆర్కెస్ట్రాల మధ్య పోటీలు జరిగాయి. చాలా ఆర్కెస్ట్రాలు ఈ పోటీల్లో పాల్గొనగా రాగప్రియ అంధ బృందం రన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత 16 గంటల నిర్విరామ సంగీత విభావరి, ఈ మధ్య 50 గంటల నిర్విరామ సంగీత విభావరులు నిర్వహించి లిమ్కా బుక్ మరియు గిన్నిస్ బుక్‌ల దిశగా రాగప్రియ బృందం అడుగు వేసింది. ఆ మధ్య వీళ్లకు విదేశాలు వెళ్లే అవకాశం కూడా వచ్చింది. తమిళ, తెలుగు సినీరంగాలకు చెందిన ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, సంగీత దర్శకులు రాగప్రియ కార్యక్రమాలకు ఎన్నోమార్లు విచ్చేసి ప్రశంసల వర్షం కురిపించారు. అలా... వీళ్లు మొదట తమిళ సినిమా (దాని పేరు కూడా ఆటోగ్రాఫే)లోకి ప్రవేశించి, తర్వాత మన రవితేజ దృష్టిలో పడ్డారన్నమాట. ఎస్పీబీ ఈ బృందాన్ని "ఆర్కెస్ట్రా బై గాడ్ బ్లెస్డ్" అని కొనియాడారు.

కచేరీల్లో పాటలు పాడేందుకు ఈ సంగీత బృందంలోని అంధ గాయనీ గాయకులు గానీ వాద్య కళాకారులుగానీ బ్రెయిలీ లిపిపై ఏమాత్రం ఆధారపడరు. ఈ అంధుల సంగీత బృందంలో ప్రతి ఒక్కరికీ కనీసం 200 పాటలు కంఠతా వచ్చు. అందరికీ వాళ్ల జ్ఞాపకశక్తే పెట్టుబడి. సాధనే వారి అసలైన బడి. అదే వాళ్ల అమ్మ ఒడి. అన్నట్లు వీరి గానం తమిళ భాషకే పరిమితం కాదండోయ్... తెలుగు, కన్నడ, మలయాళ గీతాలనూ అలపించగలరు. వీళ్ల సాధన పద్ధతి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా విడుదల కాగానే రాగప్రియ నిర్వాహకుడు కోమగన్ ఆ క్యాసెట్ లేదా సీడీ కొని అందులోని మంచి పాటల్ని ఎంపిక చేస్తాడు. తన రాగప్రియులందరికీ ఫోన్లు చేసి ఆ పాటలు వివరాలు చెప్పి సాధన చేయమంటాడు. ఆ తర్వాతి ఆదివారం అందరూ కలుసుకొని సామూహిక సాధన చేసి పరిపూర్ణత సాధిస్తారు.

అసలు ఈ అంధ సంగీత బృంద నిర్వాహకుడు కోమగన్ గురించి కొంచెం తెలుసుకుందాం. అతను పుట్టుగుడ్డి. తనలాగే అందరికీ కళ్లుండవేమో అనుకునేవాడట. చెన్నైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థలో చేరాకే అసలు ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాడు. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. వైరు కుర్చీల అల్లిక నుంచి స్వరాల పల్లకీలు ఎక్కడం వరకూ అన్నీ అతనికి తెలుసు. పాడటం, ధ్వన్యనుకరణ (మిమిక్రీ), బేస్ గిటార్, డ్రమ్స్ ఇలా.... ఎన్నో అంశాల్లో నైపుణ్యాన్ని సాధించాడు. ప్రతి పురుషుని వెనుకా ఓ స్త్రీ ఉంటుందన్న నానుడి కోమగన్ విషయంలో నూటికి నూరుపాళ్లూ నిజం. కళ్లులేని కోమగన్‌ను అతని భార్య అనిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేరణతోనే అతను ఈ రాగప్రియ సంగీత బృందాన్ని స్థాపించడం, విజయాలు సాధించడం అన్నీ జరిగాయి. కోమగన్ - అనితలు మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరెందరో అంధుల జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తారని ఆకాంక్షిద్దాం. Print this post

9 comments:

Anonymous said...

Srinivas, thanks for sharing this information. Its very inspirational to know about these kind of people.

~ Raju

C. Narayana Rao said...

Very inspiring!

Anonymous said...

Srinivas Garu,

Thanks for posting this. Your blog is so interesting. Keep up the good work and Good Luck

Srinivas

Anonymous said...

VQxNaE The best blog you have!

Anonymous said...

YXR4S4 Hello all!

Anonymous said...

Wonderful blog.

Anonymous said...

QBIKOl write more, thanks.

Anonymous said...

Thanks to author.

Anonymous said...

Friends help you move. Real friends help you move bodies