Tuesday, April 11, 2006

వడియాలతో వడివడిగా...

ఆయన మొదట పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. ఫలితం నష్టాలు. తర్వాత కోళ్ల ఫారం పెట్టారు. ఫలితం కష్టాలు. ఇది కాదనుకొని ఎస్టీడీ బూత్ పెట్టగా కష్టనష్టాలు నట్టింట నడిచాయి. ఇక లాభం లేదనుకొని ఆయన శ్రీమతి గంగా భవాని కేవలం 15 రూపాయలు పట్టుకొని రంగప్రవేశం చేసారు. తెలుగింటా రోజూ కరకరలాడే ఆవిరి వడియాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆవిడకు తెలిసిన విద్య అదే. మరి ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈమె కేంద్రంలో ఒక రోజుకు ఉత్పత్తి చేసే సుమారు 40 నుంచి 50 కిలోల వడియాలు విజయవాడ, విశాఖ, గుంటూరు తదితర పట్టణాల్లోని ప్రముఖ హొటళ్లకు పరుగులు తీస్తుంటాయి. తన అవిడియాలతో (సారీ ఐడియాలతో.... జస్ట్ ప్రాసకోసం) ఎన్ని రకాల ఒడియాలు చేస్తారో చెప్పనా ? కొత్తిమీర, కాకర, పుదీనా, బీట్ రూట్, మొక్కజొన్న, క్యారెట్, మిర్చి, వాము... ఇలా ఎన్నో రకాల మిశ్రమాలతో కూడిన వడియాలను గంగా భవాని బృందం తయారు చేస్తుంటుంది. ఈ కృషిలో ఆమె భర్త, ఓ కుమారుడు చేయుతనందిస్తున్నారు. అన్నట్లు వీళ్లది ఏ ఊరో చెప్పలేదు కదూ.... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం, చొదిమెళ్ల పంచాయితీలోని లక్ష్మీపురం గ్రామం. కృషికి సృజనాత్మకత తోడైతే జీవితంలో కొత్తకోణాలెన్నో కనిపిస్తాయనడానికి ఈ కుటుంబమే ఉదాహరణ. Print this post

No comments: