Friday, April 21, 2006

తేనెటీగలు మళ్లీ వచ్చాయి....

ఇది 1993 నాటి విషయం. అప్పట్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా చెరువతూర్ ప్రాంతంలో వ్యవసాయ శాఖ చిరుద్యోగిగా పనిచేస్తున్న 57 ఏళ్ల లీలా కుమారిపై ఆ రాష్ట్ర ప్లాంటేషన్ కార్పోరేషన్ అధికారులు పగబట్టారు. ఆమెపై దాడి చేయడానికి గూండాలను పంపడమే గాక ఆమె ఇంటిపై పెస్టిసైడ్ కంపెనీ హెలికాఫ్టర్‌తో రసాయనాన్ని కుమ్మరించారు. ఇంతకూ లీలాకుమారి చేసిన తప్పల్లా... ఎండోసల్ఫాన్ రసాయనాన్ని ఇక్కడి జీడి తోటల్లో చల్లవద్దనడం, ఇందుకోసం ఆవిడ కోర్టుకెక్కడం. ఈ ప్రాంతంలోని జీడితోటల్లో పురుగులను చంపడానికి ప్లాంటేషన్ శాఖ హెలికాఫ్టర్ ద్వారా ఎండోసల్ఫాన్ రసాయనం సృష్టించిన అల్లకల్లోలమే సమస్యకు మూలకారణం. ఈ రసాయన ప్రభావం ఆ తోటల్లోని పురుగులను చంపడంతో ఆగిపోలేదు. అక్కడి జనం ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఈ రసాయనాన్ని తోటల్లో చల్లినప్పుడల్లా ఆ ప్రాంతవాసులకు ఆస్మా, క్యాన్సర్, నరాలు, మెదడు, స్త్రీలకు పునరుత్పత్తి సమస్యలు.... ఇలా ఎన్నెన్నో వ్యాధులు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడి పర్యావరణం కూడా స్తంభించి పక్షులను పారిపోయేలా చెసింది. మరోపక్క రైతులు కట్టే గూళ్లలో చేరి పుట్టతేనెను పండించే తేనెటీగలు తుర్రుమన్నాయి.

ఈ ఎండోసల్ఫాన్ విషపూరితమైనదని యూరోపియన్ యూనియన్, అమెరికా ఎన్విరానమెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు దీనిని నిషేధించినా గత 18 ఏళ్లుగా సుమారు 5 వేల ఎకరాల్లో ఈ రసాయనాన్ని కుమ్మరించారు ప్రభుత్వాధికారులు. దీని ప్రమాదకర ప్రభావాన్ని గుర్తించి పొరాటానికి సన్నద్ధమైన లీలా కుమారికి మొదట గ్రామస్ధుల సహకారం లభించకపోయినా తర్వాత చేయూతనిచ్చారు. లీలా కుమారి పట్టుదలకు మీడియా తోడ్పాటు లభించడంతో పాటు స్థానిక వైద్యులు కూడా దిగజారిన ఇక్కడి ఆరోగ్య ప్రమాణాలపై నివేదికలిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్ సైతం రంగంలోకి దిగి ఈ ప్రాంతవాసులకు రక్త పరీక్షలు చేసి జరుగుతున్న దారుణాన్ని ధృవీకరించింది. దీంతో కేరళ హైకోర్టు ఎండోసల్ఫాన్ పిచికారీని పూర్తిగా నిషేధించింది. ఫలితంగా చెరువతూర్ ప్రాంతంలోని పర్యావరణ, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు వైద్యసేవలందించాయి. ఇప్పుడిక్కడి రైతులంతా సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు. ఇదంతా లీలాకుమారి చలవే మరి.

ఈ రసాయనం కారణంగా అనారోగ్యం పాలైన తన కొడుకు చికిత్సకు అవుతున్న ఖర్చులు, మరోవైపు ఈ కేసుకై అవుతున్న వ్యయభారం, ఇంచుమించు అదే సమయంలో తానూ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైనా.... లీలాకుమారి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయం సాధించింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ, జరుగుతున్న్ దారుణాన్ని ఎండగట్టేందుకు మరో ప్రభుత్వ సంస్థతో పోరాటానికి వెనుకాడలేదామె. కొట్టాయం జిల్లాలోని కిజుతిరి గ్రామంలో 11 మంది సంతానం ఉన్న కుటుంబంలో ఏడో బిడ్డగా పుట్టిన లీలాకుమారి వ్యవసాయ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సును మాత్రమే చదివారు. వ్యవసాయ శాఖలో ఆమె ఉన్నతాధికారి కూడా కాదు. అంతా బాగుండాలనే ఆమె తపన అందరి జీవితాల్లోనూ కొత్తకోణాలను చూపించింది. దశాబ్దాల కిందటే తుర్రుమన్న తేనెటీగలు తిరిగొచ్చాయి, పారిపోయిన పక్షుల కిలకిలారావాలు మళ్లీ వినిపించాయి. Print this post

1 comment:

రానారె said...

ఆహా! ఈమె ధైర్యము సహనమూ మహాత్మాగాంధీ సత్యాగ్రహానికి ఏమాత్రం తీసిపోవు. ఆమె చల్లగావుండాలి.