Thursday, October 06, 2011

సర్కారు బడిలో కలెక్టర్ కూతురు..

గుమస్తాలు సైతం తమ పిల్లల్ని కార్పోరేట్ బడుల్లో ఇంగ్లీష్ చదువులు చదివించాలని కలలు కంటున్న రోజులివి. అంతెందుకూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేవారి పిల్లలు కూడా కార్పోరేట్ బడుల్లోనే కంప్యూటర్ కీబోర్డులపై వేళ్ళు టకటకలాడిస్తుంటారు. ఇలాంటి ఈ రోజుల్లో తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా కలెక్టర్ ఆర్ ఆనందకుమార్ మాత్రం తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయం తీసుకుని అమలు చేసి ఎందరో అమ్మానాన్నలకు ఆశ్చర్యం కల్గించి ఆదర్శంగా నిలిచారు. ఈయన తన ఆరేళ్ళ కూతురు గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్ ప్రైమరీ పాఠశాలలో రెండవ తరగతిలో చేర్చారు.

జిల్లాలో ఎన్నో "గొప్ప" ప్రయివేట్ పాఠశాలలున్నప్పటికీ, కలెక్టర్ ఆనందకుమార్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం చాలా ఆనందం కల్గించిందని ప్రధానోపాధ్యాయిని ఎస్.రాణి సంతోషపడ్డారు. జిల్లా ముఖ్య విద్యాధికారి ఈ పరిణామంపై స్పందిస్తూ తమ ప్రభుత్వ బడులలో కార్పోరేట్ విద్యకు దీటుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నామని, కంప్యూటర్లను వినియోగించడంతోపాటు ప్రాయోగికంగా విద్యనందిస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య కలెక్టర్ కుమార్తె సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

నిజానికి తమిళనాడులో జరిగిన ప్లస్ 2, ఎస్ఎస్ఎల్‌సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినవారే. మరి మన రాష్ట్రం ఎప్పుడు మారుతుందో.. Print this post

No comments: