Friday, January 23, 2009

నాకు పింఛనొద్దు మొర్రో...

అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.

బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.

గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు. Print this post

2 comments:

Anonymous said...

మన తాతలు(అంటే నేతలు) ఈ దాస్ గారి నుంచి కాస్త నేర్చుకుంటె మన దేశం ఇంకా ఉద్దరించేదానికి బహుముఖం గా అవకాసాలున్నయని మనవి చేసుకుంటున్నాను!

చీర్స్

జిలెబి
http://www.varudhini.tk

Unknown said...

మంచి విషయం రాశారు. అందరికీ తెల్ల రేషన్ కార్డులిస్తుంది మన ప్రభుత్వం. తిరిగి పేదరికాన్ని తగ్గిస్తున్నామని చెబుతుంది. ఏమిటీ వైరుధ్యం?