Wednesday, August 12, 2009

అంధ(ద)మైన దత్తత

సంతానం లేనివారెవరైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు? మొదట తమ మతం, తర్వాత తమ కులం, ఆ తర్వాత తమ బంధువులు లేదా స్నేహితుల కుటుంబాల్లోంచి ఎవర్నైనా దత్తత తీసుకోవాలని చూస్తారు. ఏమీ కాకుంటే అనాథ శరణాలయాలకే చివరిగా వెళ్ళేది. దత్తతగా తీసుకోదలచిన బిడ్డ ఆరోగ్యం సంగతి మరీ ముఖ్యంగా చూసుకుంటారు. ఇక అంగవైకల్యం ఉన్న పిల్లలంటే దత్తత మాట దేవుడెరుగంటూ అలాంటివాళ్ళు వద్దని ఆమడ దూరం పరుగు తీస్తారు. కానీ అమెరికాకు చెందిన అంధుడు జాన్‌కర్ల్ ఫీజ్, మేరీ దంపతులు మాత్రం దేశదేశాల్లో వెతికి వెతికి చివరికి మన దేశంలో అంధ బాలుడైన నాలుగేళ్ళ జ్యోతిని ఈ ఏడాది జూన్‌లో దత్తత తీసుకున్నారు. ఒరిస్సాలోని ప్రముఖ పట్టణం కటక్‌లో ఉన్న "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఈ కారుణ్యపూరిత సంఘటన చోటుచేసుకుంది. అంగవికలురైనవారు మరెవరినైనా దత్తత తీసుకుంటే ఆ బిడ్డ తమకు ఆసరాగా ఉండాలని భావిస్తారు. కానీ, అంధుడైన జాన్‌కర్ల్ తనలాంటి మరొక అంధుడిని దత్తత చేసుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఇందుకు కారణమేంటని అతన్ని అడిగితే.... అంధుడిగా పుట్టి తాను అనుభవిస్తున్న బాధలు మరొకరికి కలుగకుండా చూడాలనే భావనతో అంధ బాలుణ్ణి పెంచుకోదలచినట్లు చెప్పాడు. స్వశక్తితో కంప్యూటర్ సంస్థ యజమానిగా ఎదిగిన జాన్‌కర్ల్ భార్య మేరీ అమెరికాలోని ఒక అంధ విద్యార్థుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. ఇక జ్యోతి ఎవరంటే, కటక్‌లోని జగత్‌పూర్‌లో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టాడు. పుట్టుకతోనే ఈ బాలుడు అంధుడు కావడంతో అతని తల్లిదండ్రులు ఇతన్ని రోడ్డుపైనే విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఈ అబ్బాయి "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు. Print this post

2 comments:

Satyamevajayate said...

నిజంగా ..ఎంతో గొప్ప పనిచేసారు ..ఆయన . సొంత మనుషులనే నిర్దాక్షిణ్యంగా .. వదిలి వెళ్లి పోయే సమాజంలో ..ఒక అంధ బాలుడిని దగ్గరకు తీసుకోవడం ..హర్షించ దగ్గ విషయం.స్ఫూర్తి కలగాలి మనందరికీ ...

నీటి బొట్టు said...

good post