Saturday, February 07, 2009

హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు

హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.

తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి. Print this post

1 comment:

Anonymous said...

కొజ్జాలుగా పుట్టడం ప్రకృతిలో జరిగే తప్పు కానీ వాళ్ళు తమకు తాముగా వ్యక్తిగతంగా చేసుకున్న తప్పు కాదు. కొజా వాళ్ళని నీచంగా చూడడం, "కొజ్జా" అనే పదాన్ని బూతు తిట్టుగా ఉపయోగించడం లాంటి వాటి వల్ల మన సమాజంలో సంస్కారం ఏ స్థాయికి దిగజారిందో అర్థమైపోతోంది.