శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.
ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...
ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Good post. Congrats.
Post a Comment