Monday, July 20, 2009

ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....

కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.

రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.

""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.

చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.

""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.

అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు. Print this post

5 comments:

Malakpet Rowdy said...

Just great!

చిలమకూరు విజయమోహన్ said...

పిల్లవాని ఔన్నత్యానికి అబ్బురపడుతున్నా. చిన్నపిల్లలకు వందనం చేయకూడదంటారు కానీ నాకు శిరస్సు వంచి నమస్కారం చేయాలనిపిస్తోంది.

Anonymous said...

ఇలాంటి మానవత భావన ప్రతి మనిషిలో వుంటే... మన ప్రపంచానికి ఇంకో కోటి సవత్సరాలు భవిషత్తు వుంటుంది .... చిన్నవాడైనా..... మైఖేల్ కి శతకోటి వందనాలు ...

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అంబేద్కర్ హరిజనుడు, గాంధీ కొమటి, నెహ్రు కాశ్మీరీ పండిట్ అని చదువుకొనే మనపిల్లలకు ఇలాంటివాళ్ల గురించి చదివే రోజువచ్చేనా? ఏప్రభుత్వమైనా సిలబస్‌లో చెర్చేనా?

నీటి బొట్టు said...

good post