Friday, June 30, 2006

పురుగు... పరుగో పరుగు

ఆయన పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు ఉత్పత్తి చేసే ఎరువుల పనితీరు చూశాడు. వందలు, వేలాది రూపాయల ఖర్చుతో కొన్న ఆ రసాయనిక ఎరువులు పురుగుల్ని చంపలేవు సరికదా... రైతుకు, పంటలకు మేలు చేసే వనరులు సైతం హరించుకుపోతాయి. పైగా వాతావరణ కలుషితం, అనారోగ్యాలూ మామూలే. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో.. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. మరి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ముబారక్‌పూర్‌కు చెందిన పొన్నుస్వామి అనే రైతు ఏం చేశారో తెలుసా...

నిర్దిష్ట నిష్పత్తుల్లో వేప, కానుగ గింజలు, ఎండు సీతాఫలాలు, జట్రోపాలను పొడిచేసి, రెండు రకాల బ్యాక్టీరియాలను (డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా, బి బ్యాక్టీరియా) మిశ్రమించి, బెల్లం నీటిలో ఆ పొడిని కలుపగా తయారైన సేంద్రీయ ద్రావణాన్ని తన పొలంలో పిచికారీ చేశారు. అంతే... కూరగాయలు, పత్తి, ద్రాక్ష వంటి పొలాల నుంచి పురుగులకు విముక్తి లభించింది. గత రెండేళ్లుగా ఈయన ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పైగా ఈయన అనుసరిస్తున్న పద్ధతి సరైనదేనంటూ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శశిభూషణ్ కూడా నిర్ధారించారు.

తన విధానంపై పొన్నుస్వామి ఏమంటారంటే... ఈ పద్ధతిలో విషరహిత కాయగూరలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెరుగై, అధిక ధర లభిస్తుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు శిక్షణనివ్వడానికి తాను సిద్ధమేనంటున్నారు. పై వస్తువుల కోసం సామాజిక వన విభాగం అధికారులు, బయో ఫెర్టిలైజర్స్ విక్రేతలను సంప్రదించవచ్చు.

పొన్ను స్వామి చెప్పిన విధానం....

250 కిలోల వేపగింజలు, 250 కిలోల జట్రోపా గింజలు, 250 కిలోల కానుగ గింజలు, 250 కిలోల ఎండు సీతాఫలాలు కలిపి పొడి చెయ్యాలి. మొత్తం 1000 కిలోల పొడిలో డి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి నెల్లాళ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమానికి కిలో బి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి మరో నెల్లాళ్లు అలాగే ఉంచాలి. తర్వాత 200 లీటర్ల నీళ్లకు కిలో బెల్లం చేర్చి ఉంచాలి. ఇదంతా పూర్తయ్యాక డి, బి - బ్యాక్టీరియాలు కలిపి ఉన్న గింజల పొడి మిశ్రమాన్ని 20 కిలోలు తీసుకొని బెల్లం నీళ్లలో కలిపి 10 రోజుల పాటు నిల్వ చేస్తే క్రిమి సంహారక ద్రావణం సిద్ధమవుతుంది. దీనిని వడకట్టి ఉపయోగించాలి.

పై విధానంలో సిద్ధంగా ఉన్న 10 లీటర్ల ద్రావణానికి మరో 10 లీటర్ల స్వచ్ఛమైన నీటిని కలిపి పంటపై ఏడెనిమిది రోజులకోసారి పిచికారీ చెయ్యాలి. కూరగాయల తోటలకు నాలుగు సార్లు, పత్తి లేదా ద్రాక్ష వంటి పంటలకు ఐదారు సార్లు పిచికారీ చేస్తే... పురుగులు... పరుగో... పరుగు...

నేటి తరం విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులుగా మారి, రైతులకు అందుబాటులో లేని ధరల్లో, వారికి అంతగా ఉపకరించని క్రిమిసంహారక మందులను అమ్ముతూంటే... పొన్నుస్వామి లాంటి వారు తమ అనుభవ పరిజ్ఞానంతో రైతాంగం జీవితంలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

జై జవాన్... జై కిసాన్ అని మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఊరికే అన్నారా మరి. అందులోనూ... మన పొన్నుస్వామి.... నిజంగా బంగారయ్యే. ఎందుకంటే... పొన్ను అంటే తమిళంలో బంగారం అని అర్థం. Print this post

1 comment: