ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...
బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.
కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.
అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.
దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.
ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....
Print this post
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
great !
nenu chadivaanu gatam lo aa mahaanubhaavauni krushini,
atuvamti vajrasamkalpamu galavyaktule samaajaniki maargadarshakulu.
Post a Comment