చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో అడవి మనిషిగా పెరిగిన చిరంజీవిని సంఘ శక్తిగా తీర్చిదిద్దిన తల్లిగా శారద పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే నిజ జీవిత కథనం ఇలాంటిదే. తమిళనాడులోని చిదంబరం పుణ్యక్షేత్రంలో నివసిస్తున్న పద్మా మోహన్ పాత్ర ఆ శారద పాత్రకు ఏమీ తక్కువ కాదు. ఆ సినిమాలో చిరంజీవి మహారణ్యంలో పెరిగితే ఈమె కొడుకు లలిత్‌కుమార్ జనారణ్యంలో పెరిగాడు. ఇక మిగిలిన విశేషాలకు వస్తే...
ఆంధ్రలోని నెల్లూరు జిల్లాకు చెందిన పద్మా మోహన్ భర్త మోహన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఉద్యోగం నిమిత్తం తమిళనాడులో ఉంటున్నారు. పద్మా మోహన్ కొడుకు లలిత్ కుమార్ పుట్టుకతోనే అంధుడు మాత్రమేగాక చిన్నవయసుకే డౌన్‌సిండ్రోం, ఆటిజం బారినపడటంతో మెదడుపై ప్రభావం చూపి వినికిడి, మాటలు, ఎదుగుదల సమస్యలు ఏర్పడ్డాయి. మొత్తం మీద మానసికంగా శారీరకంగా తీవ్రస్థాయిలో అంగ వైకల్యానికి గురయ్యాడు. ఇక ఆ తల్లి బాధను మాటల్లో వర్ణించగలమా...?
లలిత్ కుమార్ చిన్న వయసులో ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడే తల్లి పద్మ సైతం అనారోగ్యం పాలైయ్యారు. ఈమెను చికిత్సకోసం చెన్నై ఆసుపత్రిలో చేర్పించినప్పుడు యోగాను ఆశ్రయించి కోలుకున్నారు. తనకు స్వస్థతనిచ్చిన యోగాను ఆయుధంగా చేసుకొని తన కొడుకును బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్న పద్మ అనుకున్నది సాధించారు. తన కొడుకు కోసం ఆమె కూడా బ్రెయిలీ లిపి నేర్చుకొని, అతనికి దాదాపు 100 యోగాసనాలు వేయడంలో తర్ఫీదునిచ్చారు. తల్లి సాయంతో ఈ రోజున లలిత్ కుమార్ ఏమేం సాధించాడో తెలుసా ?
భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా యోగాలో జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2005లో ప్రభుత్వం నుంచి బెస్ట్ క్రియోటివ్ ఛైల్డ్ అవార్డు సహా తమిళనాడు యోగా సంఘం, సాయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. కర్ణాటక సంగీతంలో కచేరీలు, మృదంగ వాదనలో నైపుణ్యం సాధించాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో యోగా డిప్లమో చెయ్యడానికి వయసు చాలకపోతే లలిత్ కుమార్ ప్రతిభను గుర్తించిన ప్రో-ఛాన్స్‌లర్ వయసు నిబంధనను సడలించి అవకాశాన్నిచ్చారు.
లోపాలున్న మనిషిని మాటలనే తొలిచే ఈ సమాజంలో తనను అందమైన శిల్పంగా మలిచే బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన తన తల్లే తాను నిత్యం కొలిచే దైవం అంటాడు లలిత్ కుమార్.
తన కుమారుడి ఉన్నతిలోనే ఆనందాన్ని పొందుతున్న ఈ అమ్మ జీవితంలో కొత్త కోణం ఇది.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment