Wednesday, September 27, 2006

ఖేంద్రీ.... కంటి చూపుతో నింపేస్తా

ఈ మధ్య చాలా మంది "కంటి చూపుతో చంపేస్తా" అనే ఒక సినిమా డైలాగ్‌ను పదే పదే వాడుతున్నారు. కానీ పంజాబ్‌కు చెందిన విజయ్‌పాల్ ఖేంద్రీ మాత్రం అంధులకు కంటి చూపునిచ్చి వాళ్ల బతుకుల్ని వెలుగులతో నింపేస్తా అంటున్నారు. వ్యక్తిగా... శక్తిగా... వ్యవస్థగా ఇదీ ఆయన జీవితం.

డెబ్భై ఐయిదేళ్ల వయసు... మామూలుగా అయితే ఈ వయసు వ్యక్తులు గత స్మృతులు నెమరు వేసుకుంటూ కాలక్షేపం బఠానీలు తింటూ (పళ్లు ఊడకుండా ఉంటే...) కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటారు. దాదాపు 25 (ఈ కథనం రాసేనాటికి) ఏళ్ల కిందట జీవిత బీమా సంస్థ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన ఖేంద్రీని వీరిలో ఒకరిగా చూడలేం. సేవా తత్పరతతో తపించే నిండు మనసు ఆయనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న కొందరు వ్యక్తులు ఓ రోజున ఖేంద్రీ కంటబడటంతోనే ఓ మహా నేత్రోద్యమానికి బీజం పడింది. వారికి తన స్వంత ఖర్చుతో శస్త్ర చికిత్సలు చేయించి వారి కళ్లలో వెలుగులు పూయించారు ఖేంద్రీ.. అజ్ఞానం, పేదరికం కారణంగా కంటి చూపు కరవై దృష్టికి దూరమైన అభాగ్యుల జీవితాల్ని వెలుగులతో నింపాలని ఆ క్షణాన ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే స్నేహితులను, ఆత్మీయులను కలుసుకొని తన ఉద్దేశాన్ని బయటపెట్టారు.

శుభ సంకల్పానికి చేయూతనివ్వని చేయి ఉంటుందా...? పంజాబ్‌లోని పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ పట్టణం కేంద్రంగా వీరి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. కంటి సమస్యలతో బాధపడేవారికి వైద్యపరమైన తోడ్పాటునిచ్చేందుకు ఖేంద్రీ తన బృందంతో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యకలాపాలు పలువురి ప్రశంసలకు పాత్రం కాగా అన్ని వర్గాల సహకారంతో 1995లో అమృత్‌సర్ మెడికల్ అండ్ ఐ రిలీఫ్ సొసైటీ (ఎఎమ్ఇఆర్ఎస్) ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ పేరు వింటే చాలు పంజాబ్‌లోని వేలాది గ్రామాల్లోని ఎన్నో హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. ఎందుకంటే అసంఖ్యాకంగా ఎందరో గ్రామీణులు ఎఎమ్ఇఆర్ఎస్ ఉచిత సేవల ద్వారా కంటి చూపు పొందినవారే.

ఒక్కోసారి శిబిరాలను నిర్వహించాలని కోరుతూ కొన్ని గ్రామాలవారు స్వయంగా ఈ సంస్థను కోరుతుంటారు. నెలకు కనీసం 8 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ సంస్థ చేస్తున్న సేవలు మంచితనానికి మారుపేరుగా కొనసాగుతున్నాయి. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను అవిష్కరిస్తున్నాయి. సత్సంకల్పానికి కాలం, వయసుతో పనిలేదనేదే ఖేంద్రీ జీవితం మనకు ఇచ్చే సందేశం. ఏమంటారు ? Print this post

No comments: