అవును... తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కూత్తూర్ గ్రామంలో ఉన్న వినోభా ఆశ్రమ నిర్వాహకురాలు కృష్ణమ్మాళ్‌ను ఎనభై ఏళ్ల పడుచు అనడమే సబబు. ఎందుకంటే అభాగ్యుల తరపున అహింసా మార్గంలో పోరాటం చేసి, అనుకున్నది సాధించడానికి ఆమె ఈ వయసులోనూ సిద్ధంగా ఉంటారు. అసలు ఎవరీ కృష్ణమ్మాళ్ ? 80 ఏళ్ల కిందట తమిళనాడులోని ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టారామె. కేవలం పండుగ రోజుల్లో మాత్రమే వాళ్ల ఇంట్లో బియ్యపు అన్నం కనిపిస్తుంది. అమ్మాయిలకు చదువులంటే పెద్దలనబడేవాళ్లు గయ్యిమనే ఆ రోజుల్లోనే పట్టభద్రురాలై మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే కృష్ణమ్మాళ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎగబడలేదు. బడుగు వర్గాల తోడుగా నిలిచి సమాజ సేవలో తరించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో భూదానోద్యమ సారధి ఆచార్య వినోభాభావె శిష్యులు జగన్నాథన్ పరిచయమై ఈమె లక్ష్యానికి మరింత బలం చేకురేలా దిశా నిర్దేశం చేశారు. అది ఆదిగా కృష్ణమ్మాళ్ తన సేవలను విస్తృతం చేశారు. బడుగు వర్గాలకు చేయూతనిచ్చే క్రమంలో తాను నడిపిన అహింసాయుత పోరాటాల్లో భాగంగా ఈమె ఎన్నోమార్లు జైలుకెళ్లారు. నాగపట్టణం జిల్లాలోని కీళ్‌వెన్మణి ప్రాంతంలోని రైతు కూలీలు తమ వేతనాలు పెంచమని అడిగినందుకు వారిని భూస్వాములు మరిన్ని వెతలకు గురిచేశారు. వారి పోరాటానికి చేయూతనిచ్చిన కృష్ణమ్మాళ్ పరిస్థితులను చక్కబరిచారు. అంతటితో ఆగక వారిని రైతు కూలీల స్థాయి నుంచి రైతులుగా మార్చేందుకు తానే స్వయంగా "లాబ్ టీ" అనే సంస్థను కూడా ప్రారంభించారు. భూమి లేని రైతులకు భూములనిప్పించడం, పంటలు పండించడంలో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, పేదల పిల్లలకు చదువులు చెప్పించడం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలను కృష్ణమ్మాళ్ చేపట్టి విజయాలు సాధించారు.
లక్ష్యసాధనలో వెనుకంజ వేయడం తెలియని కృష్ణమ్మాళ్ గాంధేయవాది. వినోభా శిష్యురాలిగా వారి ఆదర్శాలనే అనుసరించారు. వేధింపులు ఎదురైనా... ఆకలి పోరాటాలకు గురైనా మొక్కవోని దీక్షతో ఈ వయసులోనూ ఆమె ముందడుకు వేస్తున్నారు. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తున్నారు.
Print this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment