Sunday, April 26, 2009

అంబలి దాతా సుఖీభవ

మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది. Print this post

4 comments:

MURALI said...

అన్నయ్యా, ఇలాంటి మహానుభావులకి చేతులెత్తి దణ్ణం పెట్టాలి. ఇలాంటి వారిని చూసి కూడా మన రాజకీయ నాయకుల్లో మార్పు రాదెందుకో? విరాళాలు తిరస్కరించి తన గొప్పతనం ఇంకా పెంచుకున్నాడు. పార్టీ విరాళాల పేరుతో జరుగుతున్న విడ్డూరాలు ఎన్నో చూసి అలవాటు పడిపోయాం కదా! ఇలాంటివి జరిగితే మనకి విడ్డూరమే మరి.

amma odi said...

గ్రేట్ సార్!

పరిమళం said...

ఇంకా అటువంటి పుణ్యాత్ములు ఉన్నారండీ ! శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ....వారి ఔదార్యానికి !

చిలమకూరు విజయమోహన్ said...

తల్లి ప్రారంభించిన సేవాకార్యక్రమాన్ని 30సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న మానవతామూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.