గడచిన పాతికేళ్లుగా వేలూర్లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.
సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...
Print this post
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అవును. నిస్సందేహంగా.
ఒక విలక్షణమైన, ఆదర్శప్రాయమైన వ్యక్తిని పరిచయం చేసారు.
చక్కటి సమాచారం కష్టపడి సేకరించి రాస్తున్నందుకు మీకు అభినందనలు.
మీ ఈ ప్రోత్సాహమే నా ఉత్సాహానికి ప్రేరణ. ధన్యావాదాలు.
Post a Comment