ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారి సంఖ్య నానాటికీ క్షీణిస్తున్న నేటి తరుణంలో మాటకు కట్టుబడి మంచితనానికి ప్రతిరూపమై ఉన్న నాగభూషణం (55) లాంటి కొద్దిమందిని స్మరించుకోవలసిన బాధ్యత మనందరిదీను. ఇక ఆయనిచ్చిన మాటేమిటో.. దానిని ఎలా నెరవేర్చారో తెలుసుకోండి.
నాగభూషణంగారి గురించి నాకు తెలిసే సరికి ఆయన కడప సెంట్రల్ జైల్ వార్డర్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆయన విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో పనిచేస్తున్నప్పుడు ఒక హత్యకేసులో జీవితఖైదు శిక్షకు గురైన దువ్వూరు రాజారావు అనే వ్యక్తి ఈ జైలుకు వచ్చాడు. రాజారావు కొడుకు దువ్వూరు నేతాజీ ఆ సమయంలో 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. కొడుక్కి మంచి జీవితం ఇవ్వలేక తాను జైలుకు వచ్చానన్న బెంగతో రాజారావు తన వ్యథను జైల్ సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నాడు. ఆ సూపరింటెండెంట్‌గారు ఖైదీ రాజారావు కొడుకు నేతాజీకి సాయపడమని జైల్ వార్డర్‌గా ఉన్న నాగభూషణానికి చెప్పారు.
తన ఉన్నతాధికారి ఆదేశాల్ని శిలాశాసనంగా భావించిన వార్డర్ నాగభూషణం తన ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ బాధ్యతల్ని పూర్తిగా నెత్తిన వేసుకున్నారు. సుమారు ఎనిమిదేళ్ళపాటు దాతల సాయం తీసుకుని నేతాజీ చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. తన వంతుగా నేతాజీ కూడా కష్టపడి చదువుకుని ఇంటర్మీడియెట్ నుంచి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) వరకూ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యి, ఒక ఆదర్శ విద్యార్థిగా నిలబడ్డాడు.
నేతాజీ చదువు కొనసాగించిన ఎనిమిదేళ్ళ కాలంలో వార్డర్ నాగభూషణం విశాఖపట్టణం నుంచి నెల్లూరు, తర్వాత కడప సెంట్రల్ జైల్‌కు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడకెళ్ళినా నేతాజీ చదువు బాధ్యతను మాత్రం విస్మరించలేదాయన. అతనికి డబ్బు, వస్తువుల కొరత రాకుండా అండగా నిలిచారు. కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ కూడా కొనిపెట్టారు. పోలీసుల వ్యవహారశైలి పట్ల నేటి సమాజంలో కొంత చిన్నచూపు ఉన్నప్పటికీ నాగభూషణం లాంటి ఎందరో ఆ శాఖలో మానవత్వానికి భూషణాల్లా ఉన్నారని తెలుసుకోవాల్సి ఉంది.
నాగభూషణం వ్యక్తిత్వాన్ని పరికిస్తే, స్వతహాగా గాయకుడు మాత్రమేగాక ఉత్తమ సామాజిక కార్యకర్తగా 1984 నుంచీ పలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకూ వివిధ సంస్థల నుంచి 17 వరకూ ప్రశంసాపత్రాలు పొందారు. అయితే, ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారాయన. ఇక నేతాజీ కూడా దేశ పౌరునిగా బాధ్యతల్ని నిర్వర్తించాలని మాత్రమే ఆకాంక్షించారు.
Print this post
Thursday, October 06, 2011
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నాగ భూషణం గారికి జేజేలు. ఈ ప్రపంచంలో ఇంకా మనుషులు మిగిలి ఉన్నారని ఇలాంటి వారిని చూసినప్పుడు నమ్మకం కలుగుతోంది.
Post a Comment