Wednesday, March 22, 2006

నిన్న వెట్టిచాకిరీ...నేడు బాలల ప్రతినిధి

బీహార్‌లోని పరాసావన్‌కు చెందిన పేద ముస్లిం బిడ్డ గురియా ఖాతూన్. రెండేళ్ల కిందట నిరక్షరాశ్యురాలు, తొమ్మిదేళ్ల వయసుకే భూస్వాముల ఇంట వెట్టిచాకిరీ. ఇదీ ఆమె నేపథ్యం. మరిప్పుడో... బడికెళ్లని బాలల చేత పుస్తకాలు పట్టించే యునిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం) కార్యక్రమంలో భూమికను నిర్వహించాలంటూ ఆహ్వానం అందుకుంది. లండన్‌లో జరిగిన యునిసెఫ్ ప్రపంచ బాలల స్థితిగతుల నివేదిక విడుదల కార్యక్రమానికి భారత బాలల తరపు ప్రతినిధిగా పాల్గొంది. నేడు తోటి ముస్లిం బాలికలకు చదువు చెబుతూ కరాటే కూడా నేర్పుతోంది. చదువులోని ఆనందాన్ని ఆస్వాదించాలనే గురియా తపనే ఆమెకు ఈ హోదానిచ్చింది. గతంలో ఆమె పరిస్థితేంటో తెలుసా ? చదువు పేరెత్తితే తంతామని ఇంట్లో హెచ్చరికలు. మరోవైపు ఈడొచ్చిందని పెళ్ల ప్రయత్నాలు. ఎలాగో అమ్మ దగ్గర ఏడిస్తే మదరసాకు మాత్రం పంపారు. అక్కడ గురియా ఖురాన్ పఠనం, ఉర్దూ రాయడం నేర్చుకుంది. అదే సమయంలో ప్రభుత్వ విద్యాశాఖ నేతృత్వంలో నడిచే మహిళా సమాఖ్య నడిపే బడి గురించి గురియా తెలుసుకొని వెళ్లి చూసింది. చదువుపై మక్కువ ఎక్కువైంది. అప్పుడే మహిళా సమాఖ్య కార్యకర్త గురియాకు పరిచయమై ఆమె ఇంటికెళ్లి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసింది. చివరకు గురియా పిన్ని చొరవతో ఆమె మార్గం సుగమమైంది. గురియా ఎంచుకున్న చదువు మార్గమే నేడు ఆమె పాలిటి స్వర్గం కదూ... ఇదీ ఆమె జీవితంలో కొత్త కోణం. Print this post

No comments: